సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. మనకు అంతా గొప్పగానే కనిపిస్తున్న ఇండస్ట్రీలో ఉండే ఆర్టిస్టుల జీవితాలలో ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. వీరి జీవితం ఎప్పుడు సాఫీగా సాగుతుందనే నమ్మకం కూడా లేకపోవడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుంటూ ఉంటారు. రోజారమణి తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తరుణ్ లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆయన సినిమా మినిమం హిట్ అనే ట్యాగ్ కూడా వేసుకున్నాడు. కాని తర్వాత తరుణ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. సినిమా ఆఫర్సే కరువయ్యాయి.
తరుణ్ నటించిన ‘ప్రియమైన నీకు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’ సినిమాలతో ఆయన స్టార్ హీరోగా మారాడు. నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూలు కట్టారు. అంతలా క్రేజ్ పెంచుకున్న తరుణ్‌కు వరుస డిజాస్టర్లు రావడంతో ఫేడ్ ఔట్ అయ్యారు. ఇక రెండేళ్ల క్రితం ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించిన తరుణ్‌కి నిరాశే ఎదురైంది. దీంతో ఆయన హీరోగా సినిమాలు చేయడం కన్నా నిర్మాతగా రాణిస్తే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారట.
ప్రస్తుతం తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నట్టు తెలుస్తుంది. హీరోగా కన్నా నిర్మాతగా ప్రయత్నిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని భావించిన తరుణ్ తను సంపాదించిన మొత్తాన్ని సినిమాలకు పెట్టాలని అనుకుంటున్నాడట. నిర్మాతగా ప్రస్తుతం మూడు సినిమాలు చేసేందుకు సిద్ధమయిన తరుణ్, రెండింటిని ఓటీటీలో విడుదల చేసి ఒక చిత్రాన్ని థియేటర్‌లో రిలీజ్ చేయనున్నాడట. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వార్త వెనుక ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా, తరుణ్ నటించిన నువ్వే కావాలి చిత్రం కొద్ది రోజుల క్రితం 20 ఏళ్ళు పూర్తి చేసుకోగా, టీంతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు.