చెరకు రసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త ఆ సమస్యలు తప్పవు..!

నగరంలో ఎక్కడ చూసినా చెరకు రసం షాపులు కనిపిస్తుంటాయి. ఒక్కసారి ఆ చల్లని రసం తాగితే దాహం తీరిపోతుందనే ఊహతో ఎంతోమంది రోజూ చెరకు రసం తాగడం అలవాటు చేసుకుంటున్నారు. కానీ ఈ రసం తాగడంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెరకు రసం పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు ఇస్తుంది. ఇందులో విటమిన్ A, B, Cతో పాటు కాల్షియం, ఐరన్, రాగి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి శరీరానికి అవసరమైన ఖనిజాలు ఉంటాయి. చల్లదనం ఇవ్వడంతో పాటు శక్తి కూడా ఇస్తుంది. కానీ అదే చెరకు రసం ఎక్కువగా తాగితే కొన్ని సమస్యలు తప్పవు.

200ml చెరకు రసంలో దాదాపు 270 కేలరీలు, దాదాపు 100 గ్రాముల చక్కెర ఉంటుంది. క్రమం తప్పకుండా ఎక్కువగా తాగితే శరీరానికి అధిక కేలరీలు చేరి బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఇది సహజ చక్కెరతో నిండే ఉంటుందన్న విషయం తెలిసిందే. రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచేస్తుంది కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దీన్ని పూర్తిగా దూరంగా పెట్టుకోవడం మంచిది. చెక్కులో ఉండే అధిక చక్కెర వల్ల కాలేయం చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని పెంచుతుంది. దాంతో కొలెస్ట్రాల్ ఉన్నవారు చెరకు రసం ఎక్కువగా తాగితే హానికరమే.

చెరకు రసంలో ఉండే పోలికోసనాల్ అనే రసాయనం ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి, తలనొప్పి, తలతిరుగుడు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. ఇక తీపి ఎక్కువగా ఉండటం వల్ల చెరకు రసం ఎక్కువగా తాగితే దంతాలలో పుండ్లు, కావిటీస్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల.. వేసవిలో ఒక్కోసారి చెరకు రసం తాగడం బాగానే ఉన్నా, రోజూ ఎక్కువగా తాగితే లాభాలకంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.