ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి కీలక ఆటగాడిగా నిలిచిన దక్షిణాఫ్రికా బ్యాటర్ హెయిన్‌రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇటీవలే జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి అనంతరం… ఇక ప్రొటీస్ జెర్సీకి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం తనకు తేలిగ్గా రాలేదని… కానీ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే దిశగా ఇది సరైన అడుగుగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగంతో తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన క్లాసెన్, “ప్రొటీస్ జెర్సీ తొడిగిన ప్రతి క్షణం నా జీవితంలో అత్యున్నతంగా గడిచింది. చిన్నప్పటి కల సాకారమైందని గర్వంగా చెప్పుకోగలను. అయితే, కుటుంబానికి సమయం కేటాయించాలన్న అవసరం నన్ను ఈ దిశగా నడిపించింది” అని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆయన… దక్షిణాఫ్రికా జట్టు అభిమానిగానే కొనసాగుతానని చెప్పారు.
క్లాసెన్ 2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 60 వన్డేలు, 58 టీ20లు ఆడి వరుసగా 2141, 1000 పరుగులు చేశాడు. వన్డేల్లో నాలుగు సెంచరీలు, 11 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20ల్లో ఐదు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. మిడిల్ ఆర్డర్‌లో ఆటను చక్కగా నడిపించడంలో అతని సిక్స్‌లు మిగతా జట్లకు భయంగా మారేవి. 2024 టీ20 ప్రపంచకప్‌లో రన్నరప్ గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టులో కూడా అతను కీలక పాత్ర పోషించాడు.
తన ప్రయాణం సాఫీగా సాగలేదని, కొంతమంది కోచ్‌లు నమ్మకాన్ని నిలబెట్టినందుకు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేస్తానని క్లాసెన్ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా మంచి మిత్రత్వాలు ఏర్పడ్డాయని, క్రికెట్ తన జీవితాన్ని మార్చేసిందని అభిప్రాయపడ్డారు. ఇకపై లీగ్ క్రికెట్‌కే పరిమితమయ్యే క్లాసెన్, సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్‌లో 23 కోట్లకు కొనుగోలు కావడం ద్వారా గ్లోబల్ స్టార్‌గా నిలిచాడు.