Champions Trophy: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) నిర్వహణ సామర్థ్యంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర గాయపడటం వివాదాస్పదమవుతోంది. ఈ ఘటనలో స్టేడియంలోని ఫ్లడ్ లైట్లు సరిగ్గా లేకపోవడమే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిస్కో తరహా నాసిరకం లైట్లు పెట్టడం వల్లే రవింద్ర బంతిని చూడలేకపోయాడు. దీంతో డైరెక్ట్ గా అది అతని మొహానికి తగిలింది. మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, నాణ్యమైన స్టేడియం నిర్వహణ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
ఈ ఘటనతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్‌లో నిర్వహించడం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో కూడా పాక్ స్టేడియాల్లో మౌలిక సదుపాయాలపై అనేక విమర్శలు వచ్చాయి. బ్యాకప్ జెనరేటర్లు సరిగ్గా పని చేయకపోవడం, గ్రౌండ్ కవరింగ్ సిస్టమ్ తక్కువ స్థాయిలో ఉండటం వంటి సమస్యలు పాక్ క్రికెట్ పరువును దెబ్బతీస్తున్నాయి. అంతర్జాతీయ టోర్నమెంట్‌కు అవసరమైన ప్రమాణాలు పాటించని PCB, ఇలాంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉందా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే, గడ్డాఫీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ షో నిర్వహించిన తీరుపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతోంది. నాణ్యత లేని లైట్లు, సాంకేతిక లోపాలతో మ్యాచ్‌లను నిర్వహించడం ఎంతవరకు సమంజసం? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీలో మరిన్ని సమస్యలు ఎదురవుతాయనే భయంతో క్రికెట్ విశ్లేషకులు ఉన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ PCB నిర్వహణ సామర్థ్యాన్ని సమీక్షిస్తుందా? లేక మౌనంగానే ఉండిపోతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

