ఎస్పీ బాలసుబ్రమణ్యం : అందరికీ తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత..!

SP Bala Subramanyam

ఎస్ పి బి.. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం.. బాలు.. ఇలా కొన్ని కోట్ల మంది ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ని మనసుకు నచ్చినట్టుగా ఇన్నాళ్ళు పిలుచుకున్నారు. ఆయన గొంతెత్తి పాట పాడితే చెవులు కోసుకునేవాళ్ళు కోట్లలోనే. ఆ కోట్ల మందికి ఇప్పుడు ఆ అదృష్టం ఇక మీదట ఉండదు. బాలు స్వరం మూగబోయింది. కోట్ల అభిమానులను.. ప్రేక్షకులను వదిలి వెళ్ళిపోయారు. ఈ మాట వింటే ప్రతీ ఒక్కరిలో ఉళిక్కిపాటు. నిజమా అని గొంతులో తడి ఆరిపోయేంత సందేహం. కాని అదే నిజం. కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఈ రోజు మద్యాహ్నం 01:04 నిముషాలకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని అధికారకంగా ఎంజిఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

బాల్యం.

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4 న నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. బాలు తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ బహుమతులు సాధించాడు.

గాయకుడిగా బాలు ప్రస్థానం :

1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో సినీ గాయకుడిగా బాలు ప్రస్థానం ప్రారంభమైంది. కెరీర్ ప్రారంభం నుంచే వరసగా అవకాశాలు అందుకున్నారు. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. ఆయన ప్రతీ పాట తొలిపాట గా భావించి సాధన చేసి రికార్డింగ్ కి వెళ్ళడం నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం.

నటుడిగా బాలు :

1969 లో మొదటిసారిగా చిన్న పాత్ర తో వెండితెరమీద మెరిశారు. ఆ తర్వాత తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) లాంటి ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలు పోషించి ఆకట్టుకునారు. ముఖ్యంగా ప్రేమికుడు, పవిత్రబంధం, మిథునం సినిమాలు బాలు కి నటుడిగా గొప్ప పేరు సంపాదించిపెట్టాయి.

స్టార్ హీరోలకి డబ్బింగ్ ఆర్టిస్టుగా బాలు : బాలు పాటలు పాడటం, స్క్రీన్ మీద కనిపించడం తో పాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో ఉన్న స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి డబ్బింగ్ చెప్పారు. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. ముఖ్యంగా కమల్ హాసన్, రజనీకాంత్ లకి బాలు వాయిస్ పర్‌ఫెక్ట్ గా సూటయిందని ప్రశంసించిన వాళ్ళు ఉన్నారు.

టి.వి రంగంలో పాడుతా తీయగా తో బాలు ప్రయాణం : బాలు సినిమాల నుంచి స్మాల్ స్క్రీన్ మీద కి వచ్చి తన సత్తా చాటారు. వారాంతరాలలో ప్రసారమయ్యే పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆ కార్యక్రమాల ద్వారా ఇప్పుడున్న ఎంతో మంది గాయనీ గాయకులను పరిచయం చేయడమే కాదు వాళ్ళలో చాలా మంది గొప్ప సింగర్స్ గా ఎదగడానికి ముఖ్య కారణం అయ్యారు.

బాలు అందుకున్న పురస్కారాలు :

బాలుకు భారతదేశ కేంద్రప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 29 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది, ప్రత్యేక బహుమతి లభించింది.

బాలు వృత్తి జీవితం :

1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో సినీగాయకునిగా జీవితం ప్రారంభించారు. ఈ సినిమాకి ఎస్.పి.కోదండపాణి సంగీతమందించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో “కోదండపాణి ఆడియో ల్యాబ్స్” అన్న పేరుతో ఆడియో ల్యాబ్ ని స్థాపించారు బాలు.

40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.

బాలు వ్యక్తిగత జీవితం :

బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. పల్లవి, ఎస్. పి. చరణ్ బాలు వారసులు. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె బాలు తో కలిసి ఎన్నో సినిమాలలో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. ఈమె నటుడు శుభలేఖ సుధాకర్ ను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.

కమల్ హాసన్ తో అనుబంధం :

బాలు కి లోకనాయకుడు కమల్ హాసన్ కి ప్రత్యేమైన అనుబంధం ఉంది. బాలు మొదటిగా డబ్బింగ్ చెప్పింది కమల్ కి కావడంతో అప్పటి నుంచి ఇద్దరి మద్య బంధం బలపడుతూ వచ్చింది. కొన్ని సినిమాలకి కమల్ హాసన్ ప్రత్యేకంగా కొన్ని పాటలు, కమల్ కి డబ్బింగ్ బాలు నే చెప్పాలని పట్టుబట్టాడు. ఆ అభిమానం తో బాలు నిర్మాతగా శుభసంకల్పం అన్న సినిమా నిర్మించారు. ఈ సినిమాకి బాలు కి ఎంతో ఇష్టమైన ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.

బాలు -ఇళయరాజా ఇద్దరు కాదు ఒక్కరే :

కెరీర్ ప్రారంభం నుంచి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా ల మద్య గొప్ప స్నేహబంధం ఉంది. ఒకరినొకరు ఏరా అనుకునేంత చనువు… ఒకరికోసం ఒకరు ఆరాటపడే తత్వం చూసి ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు మిమ్మలిని ఇద్దరు కాదు ఒక్కరు అనుకుంటారని పొగిడిన సందర్భాలున్నాయి.

ఆ సమయంలో హీరోగా మారే బాలు :

ఇండస్ట్రీలో ఇన్ని ఏళ్ళ నుంచి ఎంతో మంది ప్రముఖ సింగర్స్ ఉన్నప్పటికి బాలు లో ఉన్న ప్రత్యేకత మాత్రం ఏ ఒక్కరిలో లేదని చెప్పాలి. అదే ఆ హీరోకి తగ్గట్టుగా గొంతు మార్చి పాట పాడటం. చిరంజీవి సినిమాలలో పాటలు పాడితే ఆయన గొంతు ని అనుకరించి అచ్చుగుద్దినట్టు చిరంజీవి పాడినట్టుగానే పాడటం బాలు లో ఉన్న స్పెషాలిటీ. ఇది దాదాపు అందరి హీరోల కి చేశారు బాలు. చెప్పాలంటే ఆ సమయంలో బాలు హీరో అయిపోతారు.