దేవుడు ఎక్కడో ఉండడు. మనిషిలోనే.. మనిషి రూపంలోనే ఉంటాడు.. అని పెద్దలు అంటుంటారు. అది నిజమే అని సోనూ సూద్ ను చూసి నేర్చుకోవచ్చు. సినిమాల్లో విలన్ లా కనిపించే సోనూ సూద్.. రియల్ లైఫ్ హీరో అని ఎన్నోసార్లు ఆయన నిరూపించుకున్నారు.
లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చడం దగ్గర్నుంచి.. ఇప్పటి వరకు ఎవరు సాయం కోరి వచ్చినా.. తనకు తోచిన సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు సోనూసూద్. ఆయన ఇప్పుడో బ్రాండ్. సాయానికి బ్రాండ్ అంబాసిడర్.
ఎవరు.. ఏ సాయం కావాలన్నా.. ఆయన తలుపు తడితే చాలు.. నేనున్నానంటూ సాయపడుతున్నారు. కులం, మతం, ప్రాంతం.. లాంటి భేదాలు లేకుండా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నారు సోను సూద్.
ఆయన చేస్తున్న సేవకు గాను ఆయన్ను ఐక్యరాజ్యసమితి అవార్డు వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ఆయనకు ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డును అందించింది.
ఈ అవార్డును సోనుసూద్ కు వర్చువల్ గా ప్రదానం చేశారు. ఇప్పటికే ఈ అవార్డును అందుకున్న వారు ఎంజెలినా జోలీ, డేవిడ్ బెక్ హామ్, లియోనార్డో డికాప్రియో, ప్రియాంకా చోప్రా సరసన సోనూసూద్ చేరారు.
నాకు లభించిన అరుదైన గౌరవం ఇది
ఈసందర్భంగా మాట్లాడిన సోనూసూద్.. ఇది తనకు ఒక అరుదైన గౌరవమని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందడం అనేది చాలా ప్రత్యేకమన్నారు.
దేశ ప్రజలకు నేను చేయగలిగినంత చేస్తున్నా. నాకు వీలు కుదిరినంతగా.. అయితే.. నా సేవలకు గుర్తింపు లభిస్తుందని నేను అనుకోలేదు. దానికి చాలా ఆనందంగా ఉంది.. అని సోనూసూద్ తెలిపారు.