Shami: భార్య పిటిషన్‌పై ఇబ్బందుల్లో షమీ.. సుప్రీంకోర్టు నుంచి నోటీసు జారీ..!

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి.. మాజీ భార్య హసిన్ జహాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆయనకు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసును జస్టిస్ మనోజ్ మిశ్రా, ఉజ్వల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. షమీ ప్రస్తుతం తన భార్య, కుమార్తెకు నెలకు రూ.4 లక్షలు భరణంగా చెల్లిస్తున్నారు. అయితే ఆ మొత్తం సరిపోవడం లేదని, తన నెలవారీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని హసిన్ జహాన్ వాదిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2018లోనే షమీ–హసిన్ వివాదం వార్తల్లో నిలిచింది. అప్పుడు హసిన్ జహాన్ తనకు, కుమార్తెకు నెలకు రూ.10 లక్షల జీవనభృతి ఇవ్వాలని కోరారు. మొదట అలిపోర్ కోర్టు షమీని తన కుమార్తెకు రూ.80 వేలు, తన భార్యకు రూ.50 వేలూ చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆదాయం, ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అది తక్కువ మొత్తమని భావించి హసిన్ హైకోర్టును ఆశ్రయించారు.

జూలై 2025లో కోల్‌కతా హైకోర్టు ఈ మొత్తాన్ని పెంచి మొత్తం రూ.4 లక్షలుగా నిర్ణయించింది. అందులో భార్యకు రూ.1.5 లక్షలు, కుమార్తెకు రూ.2.5 లక్షలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ హసిన్ ఈ మొత్తంతో సంతృప్తి చెందకపోవడంతో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె వాదన ప్రకారం, షమీ నెలకు రూ.60 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. తన వ్యక్తిగత, విద్యా, జీవన ఖర్చులు కలిపి కనీసం రూ.6 లక్షలకు పైగా అవసరమని పేర్కొన్నారు.

ఇకపోతే, షమీ–హసిన్ వివాహ బంధం ఇంకా చట్టపరంగా ముగియలేదు. విడాకులు ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో షమీ తన క్రికెట్ కెరీర్ విషయంలోనూ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇటీవల రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ, జట్టు సెలక్షన్‌లో చోటు దక్కలేదు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రణాళికల్లో షమీ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అందులోనూ కోర్టు కేసులు, వ్యక్తిగత సమస్యలు అతని ప్రొఫెషనల్ జీవితంపై ప్రభావం చూపుతున్నాయని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు హసిన్ జహాన్ మాత్రం న్యాయం కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తానంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఒకప్పుడు మైదానంలో బౌన్సర్లు వేస్తూ ప్రత్యర్థులను గందరగోళానికి గురిచేసిన షమీ.. ఇప్పుడు న్యాయస్థానం నుంచి వచ్చే లీగల్ బౌన్సర్‌ కు ఎదురొస్తున్నారు.