ప్రముఖ బాలీవుడ్ నటి, ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం ఆమె కోటి రూపాయలకు పైగా విరాళం ప్రకటించారు. జైపూర్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో, సౌత్ వెస్ట్రన్ కమాండ్‌కి చెందిన ఆర్మీ వితంతువుల సంక్షేమ సంస్థ AWWAకి రూ.1.10 కోట్ల విరాళాన్ని అందజేశారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా ఈ విరాళం ప్రకటించారు. వీరనారిమణుల సాధికారత, వారి పిల్లల విద్యా అవసరాల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ సందర్భంగా ఆర్మీ కమాండర్, ఇతర అధికారులు, ఆర్మీ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ప్రీతి జింటా పునీత్ రిజెన్సీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సైనిక కుటుంబాల వెంట నిలవాలన్న అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రీతి మాట్లాడుతూ – “మన సైనికుల ధైర్యం వల్లే మనం నిశ్చింతగా జీవించగలుగుతున్నాం. వారి త్యాగాలకు మనం తిరుగులే ఇవ్వలేము కానీ వారి కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత” అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల భార్యలు, పిల్లలు భవిష్యత్తులో అవరోధాలు లేకుండా ముందుకెళ్లేందుకు మనం చేయగలిగిన చిన్న సహాయం కూడా పెద్ద సాయం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకు సినిమాలు, క్రికెట్‌లో తన ముద్ర వేసిన ప్రీతి, ఇప్పుడు సేవా మార్గంలో కూడా మెరిసే ప్రయత్నం చేస్తున్నారు. AWWA తరపున ప్రీతి జింటాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విరాళం దేశంలోని ఇతర ప్రముఖులకు స్ఫూర్తి కలిగించాలని ఆశిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోషల్ మీడియాలోనూ ఈ ఉదార చర్యపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.