సీనియర్ నటి అన్నపూర్ణ తాజాగా అలీతో సరదాగానే అనే షోలో వచ్చారు. అన్నపూర్ణతో పాటు వై విజయ కూడా వచ్చారు. ఇక ఈ ఇద్దరితో అలీ ఎన్నో ముచ్చట్లు పెట్టి.. ప్రేక్షకులు తెలియని వాటి గురించెన్నో బయటకు వచ్చేలా చేశాడు. అందులో భాగంగా అన్నపూర్ణ రావు గోపాల్ రావ్ మధ్య జరిగిన విషయాన్ని అడిగాడు. కారు ఉంటేనే రెమ్యూనరేషన్ పెంచుతారని ఎవరో చెప్పారట కదా? అని అన్నపూర్ణను అలీ అడిగాడు. దానికి ఆమె సమాధానం చెప్పాడరు.
రావుగోపాల్‌రావు గారు. అన్నమ్మ.. అన్నమ్మ అని పిలిచేవారని అన్నపూర్ణ చెప్పకొచ్చారు. ‘కారు ఉంటే మన రెమ్యునరేషన్ పెంచుతారు.. దర్జాగా ఉంటది.. మనకు విలువ ఇస్తారు’ అని రావు గోపాల్ రావు చెప్పారట. ‘అవునా.. సర్’ అని అంటూ అదే విషయాన్ని అన్నపూర్ణ తన అమ్మకు చెప్పిందట. ‘రేపు వేషమిస్తారో లేదో మనకు తెలియదు. ఈరోజు వరకే గుర్తు పెట్టుకో.. వాళ్లంటే పెద్దవాళ్లు. ఎప్పటి నుంచో ఇక్కడే పాతుకుపోయి ఉన్నారు. వాళ్లు కారు కొనుక్కున్నా ఇంకేది కొన్నా చెల్లుబాటు అవుతుంది. ఆడదానికి కారు కొనుక్కొనే అవసరం పెట్టుకోకూడదు. చేద్దామనుకుంటే చెయ్. లేకుంటే వెళ్లిపోదాం’ అని స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చిందిట.
ఇండస్ట్రీలోకి రాగానే కారు కొనుక్కుంటే అదో కష్టం.. ఇప్పుడు కొనకపోతే అదొక కష్టం. ఇప్పటికీ కారు లేదు. ఈ వయసులో ఎక్కడికి పోతాం.. పైగా కరోనా అందరి కళ్లు తెరిపించిందంటూ అన్నపూర్ణ సైటైర్ వేశారు. రెమ్యూనరేషన్ పెంచారట అనే రూమర్లపైనా అన్నపూర్ణ స్పందించారు. ఒకటో రెండో పోతాయ్. పోయేవాడు ముందే వద్దనుకునే మనదగ్గరికి వస్తాడంటూ చెప్పుకొచ్చారు. మన వాళ్లు మంచివాళ్లే గానీ మా జనరేషన్ వాళ్లకు డబ్బు తక్కువే ఇద్దామని ఫిక్స్ అయిపోతారంటూ కామెంట్ చేశారు. ఇంతకు ముందు డిమాండ్ చేసేది కాదు.. ఇప్పుడు డిమాండ్ చేస్తుందని అంటున్నారని తెలిపారు. మేమెంత కాలం ఉంటాం ఆలీ..! ఇప్పుడు కూడా డిమాండ్ చేసి అడక్కపోతే ఎలా..? దగ్గరదగ్గర యాభయేళ్లు అనుభవం ఉంది మాకు అంటూ చెప్పుకొచ్చారు. ఎఫ్ 2 చిత్రంతో అన్నపూర్ణ, వై విజయ కాంబో మళ్లీ ఫుల్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.