విడుదలైన 10 రోజులకే ఓటీటీలోకి ‘సర్కారు నౌకరి’!

ప్రముఖ సింగర్‌ సునీత కుమారుడు ఆకాష్‌ హీరోగా పరిచయమైన సినిమా ‘సర్కారు నౌకరి’ సినిమా జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో పాజిటివ్‌ టాక్‌నే సొంతం చేసుకున్న ఈ సినిమా.. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రంగా ప్రశంసలు అందుకుంది.

ఆకాష్‌ సరసన భావన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్‌ పై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా విడుదలైన 10 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో జనవరి 12 నుండి ఈ సినిమా స్ట్రీమిగ్‌ అవుతోంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్‌ కావడం, థియేటర్లు అన్ని పెద్ద సినిమాలకే బుక్కయిపోవడంతో.. మేకర్స్‌ ఈ సినిమాని ఓటీటీలోకి వదిలేశారు.

ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి ఆదరణనే రాబట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ‘సర్కారు నౌకరి’ కథ విషయానికి వస్తే.. మహబూబ్‌ నగర్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన గోపాల్‌ (ఆకాష్‌)కు గవర్నమెంట్‌ ఉద్యోగం వస్తుంది. తన చుట్టు పక్కల ఉండే గ్రామాల్లో నిరోధ్‌ వాడటం గురించి అవగాహన కల్పించి.. నిరోధ్‌లను ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చే జాబ్‌ అది. అయితే ఈ ఉద్యోగం తన భార్య సత్య (భావన)కి నచ్చదు.

దీంతో తను కావాలో.. ఉద్యోగం కావాలో తేల్చుకోమని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. వాళ్ల మధ్య గొడవకి కారణం, కండోమ్‌లు పంచుతున్న తన భర్తని ఆ ఊరి వాళ్లంతా హేళన చేయడం.. వాళ్లని అంటరానివాళ్లుగా చూస్తుండటంతో జాబ్‌ మానేయమని పోరు పెడుతుంటుంది.

అయితే గోపాల్‌ మాత్రం జాబే కావాలనేంతగా తన భార్యను నిర్లక్ష్యం చేస్తాడు. అందుకు కారణం ఏమిటి? ఆకాశ్‌ గతం ఏమిటి? 90స్‌లో ఎయిడ్స్‌పై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉండేది? చివరికి గోపాల్‌ తన ‘సర్కారు నౌకరి’తో ఎలాంటి పోరాటం చేశాడు? తద్వారా ఏం సాధించాడనేదే సినిమా కథ.