సంతోష్ శోభన్.. ఇంకా ఎన్నాళ్ళీలా?

చూడ్డానికి బాగానే ఉంటాడు. నటన కూడా చక్కగా చేస్తాడు. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడు. ఏవైనా భిన్నమైన పాత్రలు ఇచ్చినా చేసే టాలెంట్ ఉంది. ఫ్యామిలీ బ్యాకప్ లేకపోయినా.. ఇండస్ట్రీల నుంచి మంచి ప్రోత్సాహం ఉంది. కానీ ఏం లాభం సరైన సినిమాలు ఎంచుకోలేక సతమతమవుతున్నాడు. అతడే యంగ్ హీరో యువ సంతోష్ శోభన్.

దివంగత దర్శకుడు శోభన్ తనయుడిగా శీను లిస్టులోకి అడుగుపెట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హైస్కూల్‌ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్‌.. తను నేను చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టాడు. తొలి చిత్రంతోనే టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా సరిగా ఆడకపోయినా.. అతడికి అవకాశాలు బాగానే తెచ్చిపెట్టాయి. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్ స్క్రైబ్.. ఇలా వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోయాడు. అయితే నిజానికి అ సినిమాలన్నీ అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. అవి భారీ సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. థియేటర్లలో ఈ సినిమాలేవీ మినిమం ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. వీటిలో ఓటీటీలో రిలీజైన ఏక్ మినీ కథ మాత్రం ఆకట్టుకుంది. పాపం ఈ కుర్రాడికి మంచి టాలెంట్ ఉన్నా.. దాన్ని ఉపయోగించుకునే దర్శకుడే కరవైపోయాడు.

ఇక చివరగా వచ్చిన కళ్యాణం కమనీయం చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అనిల్ కుమార్ ఆళ్ళ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా పెద్దపెద్ద సినిమాలకు పోటీగా విడుదలైన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ సినిమా పైన చాలా హోప్స్ పెట్టుకున్న సంతోష్ శోభన్ ఆశలన్నీ అడియాసలైపోయాయి. కేవలం నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి.

ఇంకా చెప్పాలంటే.. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా గతేడాది నవంబర్లో రిలీజ్ అయింది. కళ్యాణం కమనీయం ఏడాది జనవరిలో రిలీజ్ అయింది. త్వరలోనే అతడు నటించిన అన్ని మంచి శకునములే ఏప్రిల్ లేదా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే అతడు నటించిన మరో సినిమా ప్రేమ్ కుమార్ కూడా వేసవిలో సందడి చేయనుంది. అంటే దాదాపు ఏడు నెలల గ్యాప్ లో నాలుగు సినిమాలతో.. ఇంకా చెప్పాలంటే ప్రతి రెండు నెలలకి ఒక చిత్రంతో అతడు ప్రేక్షకులను అలరిస్తున్నాడు అన్నమాట. కానీ ఏం లాభం. ఏవి అతడికి కలిసి వచ్చేలా కనపడట్లేదు.

చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ కథలను సెలెక్ట్ చేసే విధానం మార్చకపోతే, ఎంత టాలెంట్, బ్యాకప్ ఉన్నా కెరీర్ బోల్తా కొట్టడమే. మరి ఇప్పటికైనా సంతోష్ మారతాడా లేదా చూడాలి. అలానే రాబోయే చిత్రాలు ప్రేమ్ కుమార్, అన్నీ మంచి శకునములే అయినా సంతోష్‌ కెరీర్‌ను నిలబెడతాయేమో చూడాలి.