మళ్లీ సినిమాలతో బిజీగా సాయిపల్లవి!

సాయిపల్లవి నిజంగా టిపికల్‌ సౌతిండియన్‌. తను అందరిలాంటి ఆడపిల్ల కాదు. ఆమెలోని ఆత్మవిశ్వాసం.. ఆత్మగౌరవం.. నిజాయితీ.. ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. సాటి తారలతో నిలబడితే ధృవతారగా మెరిసిపోతుంటుంది తను. అందుకే ఆమెకు అంతమంది అభిమానులు. ‘గార్గి’ తర్వాత సినిమాలకు విరామం ఇచ్చి, దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగొచ్చిన ఈ బంగారుబొమ్మ.. ఇప్పుడిప్పుడే నిదానంగా మళ్లీ సినిమాలకు సైన్‌ చేస్తున్నది.

తెలుగులో నాగచైతన్య ‘తండేల్‌’, తమిళంలో శివకార్తికేయన్‌ సినిమా ఇప్పటికే ఓకే చేసింది. అవిూర్‌ఖాన్‌ కొడుకు హీరోగా రూపొందుతోన్న సినిమా ద్వారా బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్నది. ఇక నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రామాయణం’లో సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే.

మొత్తంగా మళ్లీ సాయిపల్లవి బిజీబిజీ అయిపోయింది. ఇక అసలు విషయానికొస్తే.. నటిగా ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించిన సాయిపల్లవి, త్వరలో మెగా ఫోన్‌ పట్టనుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తెలిపింది. ‘నాకు డైరెక్షన్‌ చేయాలనే ఆలోచన ఉంది. దానికోసం నా అభిరుచికీ, ఆలోచనకూ తగ్గట్టు ఓ కథ కూడా రాసుకుంటున్నాను. ప్రస్తుతం అది ఆలోచన మాత్రమే. మరి నా కథకు నిర్మాతలెవరో నాకే తెలియదు. నాకు తెలిశాక విూకు చెబుతా’ అంటూ అందంగా నవ్వేసింది సాయిపల్లవి శంతామరై.