Rinku Singh – Priya: టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ల మధ్య పెళ్లి పుకార్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం పొందుతున్న నేపధ్యంలో ప్రియా సరోజ్ తండ్రి తుఫాని సరోజ్ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. రింకూ, ప్రియా తమ పెళ్లి కోరికను కుటుంబాలకు తెలియజేసినట్టు ఆయన చెప్పారు. అయితే నిశ్చితార్థం జరగలేదని, ఇప్పటివరకు కేవలం ప్రాథమిక చర్చలే జరిగినట్టు తెలిపారు.
తుఫాని సరోజ్ మాట్లాడుతూ, “పిల్లలిద్దరూ తమ ప్రేమను తెలియజేసి పెళ్లి అనుమతి కోరారు. కానీ నిశ్చితార్థం ఇంకా జరగలేదు. కుటుంబాల మధ్య ప్రాథమిక చర్చలే జరిగాయి. ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు,” అని చెప్పారు. రింకూ, ప్రియా ప్రేమకు కుటుంబ సభ్యులు స్వాగతం పలికినప్పటికీ, ఈ విషయంపై మరింత చర్చలు జరగాల్సి ఉందని స్పష్టం చేశారు.
రింకూ సింగ్ టీమిండియా తరఫున ముఖ్యమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. తనదైన ముద్ర వేసిన రింకూ, టీ20ల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. 2023లో ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసిన అతను ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు ఆడాడు. తన బ్యాటింగ్‌లో తక్కువ ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయడంలో ప్రత్యేకత కనబరిచాడు.
ఇక వన్డే క్రికెట్‌లో రింకూకి ఇంకా అవకాశం దక్కలేదు. అయితే లిస్ట్-ఏ క్రికెట్‌లో అతడి ప్రదర్శన ఆకట్టుకునేలా ఉంది. 52 ఇన్నింగ్స్‌లలో 1,899 పరుగులు సాధించి ఒక శతకంతో పాటు 17 అర్ధ శతకాలు నమోదు చేశాడు. ఇదే అతని శక్తిని తెలియజేస్తుంది. రింకూ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 46 మ్యాచ్‌లు ఆడిన రింకూ 893 పరుగులు సాధించాడు. కెరీర్‌లో నాలుగు అర్ధశతకాలు నమోదు చేసిన అతను, తన ఆటతో కేకేఆర్‌కు కీలక విజయాలు అందించాడు.