RCB Captain: RCB కొత్త కెప్టెన్.. ఈసారైనా తలరాత మారుతుందా?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 సీజన్‌కు సంచలన నిర్ణయం తీసుకుంది. యువ ఆటగాడు రజత్ పటీదార్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. సుదీర్ఘకాలం జట్టును నడిపిన విరాట్ కోహ్లీ తర్వాత ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వం వహించాడు. కానీ, ఈ సారి ఆర్‌సీబీ కొత్త రూట్‌లో వెళ్లింది. పటీదార్ చేతిలో జట్టు పగ్గాలు పెట్టడం విశేషం. ఫాఫ్‌ను రిటైన్ చేయకపోవడం, విరాట్ సారథ్యం భుజపెట్టుకోకపోవడంతో పటీదార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

అతని కంటే అనుభవం ఉన్న కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ రేసులో ఉన్నప్పటికీ జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పటీదార్‌కే అవకాశం ఇచ్చారు. రజత్ పటీదార్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించాడు. అతను డొమెస్టిక్ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. 2022 ఐపీఎల్ సీజన్‌లో లువ్నిత్ సిసోడియా గాయపడిన నేపథ్యంలో ఆర్‌సీబీ జట్టులో రీప్లేస్‌మెంట్‌గా చేరాడు. కేవలం రూ. 20 లక్షలతో జట్టులో అడుగు పెట్టిన అతను అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇప్పటి వరకు 31 టీ20 మ్యాచ్‌లలో 861 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధశతకాలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 96. 2021 ఐపీఎల్‌లోనూ ఆర్‌సీబీ తరపున ఆడిన పటీదార్ ఆ సీజన్‌లో 4 మ్యాచ్‌ల్లో 71 పరుగులు చేశాడు. డొమెస్టిక్ అనుభవం, మిడిల్ ఆర్డర్‌లో అతని సత్తా జట్టుకు బలంగా మారాయి. ఈ సారి ఆర్‌సీబీ యువ కెప్టెన్‌తో కొత్త ప్రయాణం ప్రారంభిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని ఆర్‌సీబీ, ఈ సారి పటీదార్ సారధ్యంలో పునరుద్ధరణ ఆశిస్తోంది. ప్రధానంగా మిడిల్ ఆర్డర్‌లో నిలకడ ఆర్‌సీబీ గెలుపు అవకాశాలను పెంచుతుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే, జట్టులో సీనియర్లతో కలసి అతను జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడని ఒక ఆశ ఉంది. మరి కొత్త కెప్టెన్ RCB తలరాతను మార్చి ఫైనల్స్ వరకు తీసుకు వెళతాడో లేదో చూడాలి.

Public EXPOSED : Prudhvi Raj Comments On Ys Jagan || Ap Public Talk || Pawan kalyan || Telugu Rajyam