చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం కన్నా ప్రమాదకరం మరొకటి ఉండదని బెంగళూరు తొక్కిసలాట ఘటన మరొకసారి రుజువు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ గెలిచిన ఆనందంలో అభిమానులు ముంచెత్తిన వేళ, చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇది కేవలం నిర్వహణలో పొరపాటు కాదు, అనుమతుల విషయంలో స్పష్టత లేకపోవడమే అసలు కారణంగా ఇప్పుడు ఆరోపణలు ఎదురవుతున్నాయి.
తాజాగా బయటకు వచ్చిన అధికారిక లేఖ ప్రకారం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే జూన్ 3వ తేదీనే ప్రభుత్వానికి ఈ సన్మాన కార్యక్రమానికి అనుమతిని కోరింది. అయితే విధానసౌధ వద్ద కార్యక్రమానికి పోలీసుల నుంచి స్పష్టమైన అనుమతి రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో స్టేడియం వద్దే వేడుకను ఏర్పాటు చేయడం, అక్కడికి అనూహ్యంగా వచ్చిన అభిమానుల సంఖ్యను తక్కువగా అంచనా వేయడం గందరగోళానికి దారితీసింది.
పోలీసులు ముందుగానే హెచ్చరికలు చేసినా, వాటిని ఆర్సీబీ యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని అధికారులు అంటున్నారు. “ఆదివారం వరకు వేడుకలు వాయిదా వేసుకోవాలి” అనే పోలీసుల సూచనను, విదేశీ ఆటగాళ్లు వెళ్లిపోతారని చెప్పి తిరస్కరించినట్లు సమాచారం. చివరకు అనుమతి విషయంలో ప్రభుత్వం, క్రికెట్ అసోసియేషన్, పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడమే దీనికి మూలకారణంగా చెప్పొచ్చు.
ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తూ కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించినా, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విజయోత్సవ వేళ ఒక ఆణిముత్యం వలె మిగలాల్సిన ఈ క్షణం… కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కన్నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు ఈ దుర్ఘటన వెనుక ఉన్న అసలు బాధ్యులు ఎవరు అన్నదే నిజమైన ప్రశ్నగా మారుతోంది.