రిషి కపూర్ సోదరుడు రాజీవ్ కపూర్ మృతి !

బాలీవుడ్‌ లో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు రిషి కపూర్‌ సోదరుడు రాజీవ్‌ కపూర్ ముంబైలో మృతి చెందారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన రాజీవ్‌ కపూర్‌ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రిషి కపూర్‌ భార్య నీతూ కపూర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో రాజీవ్‌ కపూర్‌ ఫోటో షేర్‌ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. అదే విధంగా రాజీవ్‌ మృతిపట్ల అన్నయ్య రణధీర్‌ సంతాపం ప్రకటించారు.

ప్రస్తుతం ఆయన వయసు 58 సంవత్సరాలు. గతేడాది రిషి కపూర్ కన్నుమూయగా ఏడాది తిరగకముందే కపూర్ ఫ్యామిలీలో మరో విషాదం చోటుచేసుకోవడం అభిమానులను కలచివేస్తోంది. కొద్దిసేపటి క్రితం రాజీవ్ కపూర్‌కి గుండెపోటు రావడంతో చెంబూర్ లోని వారి నివాసానికి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వైద్యం చేస్తుండగానే హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్‌ను అంతా ముద్దుగా చింపు అనే పేరుతో పిలుచుకునేవారు.

1991లో సూపర్ హిట్ సినిమా హెన్నాతో నిర్మాతగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రాజీవ్ కపూర్. ప్రేమ్ గ్రంథ్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నారు. రామ్ తేరి గంగా మెయిలీ, మేరా సాతి, హమ్ టు చాలే పార్డెస్ వంటి సినిమాల్లో నటించి నటుడిగా కూడా సత్తా చాటారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.