టీమిండియా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ తన ఆదాయంలో పేదలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం ‘రిషభ్ పంత్ ఫౌండేషన్’ (RPF) ద్వారా ఆర్థికంగా వెనుకబడినవారికి అందించనున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేస్తూ ప్రకటించాడు.
తన జీవితంలో ఎదురైన అనుభవాలు ఎన్నో విషయాలను నేర్పించాయని, అందుకే తాను పొందిన దాంట్లో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పంత్ పేర్కొన్నాడు. క్రికెట్ తనకు పేరు, ప్రతిష్ట, ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చిందని, ఇప్పుడు సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో RPF ద్వారా సేవ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. వచ్చే రెండు నెలల్లో పూర్తి వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నాడు.
పంత్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయాన్ని ఆస్వాదిస్తూనే, సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించేలా ఆలోచిస్తున్న తీరును ప్రశంసిస్తున్నారు. “సక్సెస్‌ఫుల్ ఆటగాళ్లు మాత్రమే కాదు, గొప్ప మనసున్న వాళ్లు ఇలాంటివి చేయగలరు” అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
ప్రస్తుతం పంత్ దాదాపు 10 బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా ఉన్నాడు. అంతేకాదు, IPL 2024లో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు తీసుకుని క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలకంగా మారిన రిషభ్, ఇప్పుడు తన ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచాడు.