RCB: చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట.. ముగ్గురు అభిమానులు మృతి..!

ఐపీఎల్ 2025 ట్రోఫీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చరిత్రలో నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించి చివరికి తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దేశమంతా ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది. కానీ ఆ ఆనందంలో ఓ విషాధం చోటుచేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఘోర సంఘటన అందరినీ కలచివేసింది.

విజయోత్సవం.. కానీ విషాదాంతం:
విజయాన్ని అభిమానులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఆర్సీబీ యాజమాన్యం బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో గ్రాండ్ సెలబ్రేషన్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. బుధవారం మధ్యాహ్నానికి పబ్లిక్‌కు ప్రవేశం ఇస్తామని ప్రకటించడంతో.. వేలాది మంది అభిమానులు ఉదయమే స్టేడియంకు తరలివచ్చారు. టికెట్లతోపాటు టికెట్ లేకుండా వచ్చిన అభిమానులు కూడా భారీ సంఖ్యలో గేట్ల వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నానికి గేట్ల వద్ద భయంకరమైన రద్దీ ఏర్పడింది. పరిస్థితిని నియంత్రించడంలో సెక్యూరిటీ విఫలమవడంతో… ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది.

ఈ తొక్కిసలాటలో ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలువురు అభిమానులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అభిమానుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆర్సీబీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. సరైన ప్లానింగ్ లేకుండా ఈవెంట్ పెట్టారని ఆరోపిస్తున్నారు.