మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న “క్రాక్” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సరస్వతి ఫిలిం డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఈ సినిమా మీద అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మాస్‌రాజా రవితేజ మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
ఆయన మాట్లాడుతూ… మామూలు రోజుల్లో సినిమా చూడడానికి, పండుగ సీజన్లో చూడడానికి ఏదో కొత్త అనుభూతి ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అలానే సినిమాలు చూసి వచ్చాను. ఈ పండుగకి పక్కా కమర్షియల్ ఫిలిం ‘క్రాక్’తో ప్రేక్షకుల ముందుకి రావటం ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది,మాస్ ఎలిమెంట్స్ సూపర్‌గా ఉన్నాయి, అలాగే పాటలు కూడా బాగా కుదిరాయి. ఈ పండుగకి తప్పకుండా సినిమా ఒక విందు బోజనంలా ఉంటుందని ఆడియన్స్ కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.
సముద్రఖని గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఈ సినిమాలో ఆయన ఒక మంచి పాత్రలో కనిపిస్తారు. అలాగే శృతి హాసన్,వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. తమన్ మ్యూజిక్‌తో పాటు జీకే విష్ణు సినిమాటోగ్రఫీ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. రియల్ ఇన్స్‌డెంట్స్, రియల్ క్యారెక్టర్స్ తీసుకొని చేసిన సినిమా ఇది. ప్రతి సంక్రాంతికి చాలా సినిమాలు విడుదలవడం ఎప్పటినుండో జరుగుతున్నదే, బాగుంటే అన్ని సినిమాలు ఆడుతాయి. ఎందుకంటే ఒక సినిమా చూశాక మరో సినిమా చూడను అని ఎవరూ అనుకోరు. అన్ని సినిమాలు చూస్తారు.. పండుగంటే అదే కదా అని చెప్పుకొచ్చారు.
తమిళనాడులో సినిమాలని తిరిగి యధాతధంగా ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా విడుదలచేసుకునే వెసులుబాటుని ప్రభుత్వం కలిపించింది. మన దగ్గర కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలిసింది. పర్మీషన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏది ఏమైనా థియేటర్‌కి వచ్చి సినిమా చూసే ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. అలాగే వీలైతే చిన్న శానిటైజర్ బాటిల్ కూడా మీ వెంట తెచ్చుకోవాల్సిందిగా నా తరుపున మనవి అని ఆయన సూచనలు తెలియచేసారు.