10 వారాల తర్వాతే ఓటీటీలో సినిమాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత మండలి?

దేశంలో కరోనా విజృంభించడంతో థియేటర్లన్ని మూతపడ్డాయి. థియేటర్లు మూతపడటంతో ఓటీటీలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. కరోనా తగ్గిన తర్వాత కూడా ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు ఓటీటీలో ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు. దీంతో థియేటర్లలో సినిమాలు విడుదల చేసిన కొంతకాలానికి వాటిని ఓటీటిలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఓటీటీలో సినిమా విడుదలకు సంబంధించి సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి థియేటర్‌లో విడుదలైన భారీ సినిమాలు పదివారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించి సినీ ప్రియులకు షాక్ ఇచ్చింది.

తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. సినిమా పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగులు నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయాన్ని కమిటీకి వదిలేశారు. ఈ సమావేశంలో ఇటీవల కార్యవర్గ సమావేశంలో చర్చించిన 8 కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ క్రమంలో భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలను థియేటర్లలో విడుదలైన 10 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఇక ఆరుకోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించిన సినిమాల గురించి ఫెడరేషన్ తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలి.సినిమా టికెట్ ధరలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలాగా నిర్ణయం తీసుకున్నారు.

రోజురోజుకి సినిమా నిర్మాణ వ్యయం పెరగటంతో నిర్మాతలు కౌన్సిల్ ఛాంబర్ నియమ నిబంధనలను పాటించాలి. అంతేకాకుండా ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి తో చర్చించిన తర్వాతే సినిమా వ్యయాన్ని పెంచాలని తీర్మానించారు. ఇక ఫైటర్స్ యూనియన్ – ఫెడరేషన్ సమస్యల గురించి మరొకసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక సినిమా నిర్మాణంలో మేనేజర్ల పాత్ర నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించారు.ఇక సినిమా షూటింగ్ విషయంలో ఖచ్చితమైన సమయపాలన అమలు చేయాలి. అందువల్ల షూటింగ్ కోసం మదనపు రోజులు కేటాయించకుండా అనుకున్న సమయానికి షూటింగ్ పనులు పూర్తి అవుతాయి. ఇక నటులందరూ వారి సహాయకులకు కూడా వసతి సౌకర్యాలు కల్పించమని డిమాండ్ చేయకూడదు. అలాంటి సౌకర్యాల కోసం వారి పారితోషికం నుండి చెల్లింపులు చేసుకోవాలి.