పవర్‌ఫుల్‌ లేడీగా ప్రగ్యాజైస్వాల్‌!

యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రస్తుతం సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో ఓ యాక్షన్‌ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా, తమ నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ మీద నిర్మిస్తున్నారు. చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర నిర్వాహకులు ఈ సినిమా నుండి అతని లుక్‌ ను విడుదల చేశారు.

అలాగే ఈ చిత్రానికి ‘టైసన్‌ నాయుడు’ అనే టైటిల్‌ కూడా పెట్టినట్టుగా అధికారికంగా చెప్పారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్‌ పాత్ర బాక్సింగ్‌ ఎక్స్‌ పర్ట్‌, లెజెండ్‌ మైక్‌  టైసన్‌ అభిమానిగా పరిచయం చేసే గ్లింప్స్‌ ఆసక్తికరంగా వుంది. బెల్లంకొండ ఈ సినిమాలో ఒక పోలీసాఫీసరుగా నటిస్తున్నారు.

అతనికి మైక్‌ టైసన్‌ అంటే ఇష్టం కాబట్టి, టైసన్‌ నాయుడు అని పేరు పెట్టుకున్నట్టుగా విడుదల చేసిన ప్రచార చిత్రం చూస్తే అర్థం అవుతోంది. అయితే ఈ సినిమాలో బెల్లంకొండ ఢీ కొట్టబోయేది ఒక పవర్‌ ఫుల్‌ లేడీని అని సమాచారం. దర్శకుడు సాగర్‌ చంద్ర ఈ సినిమాలో లేడీ విలన్‌ అయితే బాగుటుంది అని చాలామందిని అనుకొని, చివరికి ఆ నటిని పెట్టుకున్నట్టుగా ఒక సమాచారం. ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా, ఆమె మరెవరో కాదు ప్రగ్యా జైస్వాల్‌ అని తెలిసింది.

ఇంతకు ముందు క్రిష్‌ జాగర్లమూడి సినిమా ‘కంచె’ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యారు. ఆ తరువాత మరికొన్ని తెలుగు సినిమాలలో నటించారు, అందులో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన ‘జయ జానకి నాయకా’ సినిమాలో కూడా నటించారు. ఆమధ్య విడుదలైన బాలకృష్ణ సినిమా ‘అఖండ’ లో కథానాయకురాలిగా నటించారు ప్రగ్యా జైస్వాల్‌. ఆమె తనకి నచ్చిన పాత్రలనే చేస్తూ కొన్ని సినిమాలు మాత్రమే ఒప్పుకుంటున్నారు.

ఇప్పుడు ఈ ‘టైసన్‌ నాయుడు’ లో ఆమె విలన్‌ పాత్ర చేస్తున్నట్టుగా తెలిసింది. ఈమె కన్నా ముందు చాలామందిని అనుకున్నా, కొత్తగా ఉండాలని చెప్పి ప్రగ్యా జైస్వాల్‌ ని ఇందులో తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌ కూడా జరుగుతోంది. ఈ సినిమాకి భీమ్స్‌ సిసిరోలియో నేపధ్య సంగీతం సమకూరుస్తున్నారు.