Prabhas: గత కొద్ది రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో టికెట్ల రేట్లు ఎంతో దారుణంగా ఉండిపోయాయి. సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుందని సినిమా టిక్కెట్ల రేట్లపై మరోసారి పునరాలోచన చేయాలని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వేడుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రితో ఈ విషయాల గురించి చర్చించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీ అయిన తర్వాత మరోసారి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ వంటి తదితరులు ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి సినీ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.వీరు చెప్పిన విషయాలపై సామరస్యంగా స్పందించిన జగన్ సానుకూలంగా వ్యవహరించారని తెలియజేశారు. అయితే సినీ పెద్దలు కలిసినప్పటికీ జగన్ తన నిర్ణయంలో ఏవిధమైనటువంటి మార్పు చేయలేదని తెలియడంతో మరోసారి పలువురు విమర్శలు చేశారు.
కానీ తాజాగా ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ కొత్త జీవో విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని పలువురు సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రభాస్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి , సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.