ఆకట్టుకుంటున్న ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ట్రైలర్‌!

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటించింది. భారత వైమానిక దళ ధైర్య సాహసాలు, త్యాగాలను ఆవిష్కరిస్తూ యథార్థ సంఘటనల ఆధారంగా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ట్రైలన్‌ను విడుదల చేసింది.

తెలుగులో ఈ మూవీ ట్రైలర్‌ను టాలీవుడ్‌ పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ విడుదల చేయగా.. హిందీలో సల్మాన్‌ ఖాన్‌ రిలీజ్‌ చేశారు. రామ్‌ చరణ్‌ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తూ తన తమ్ముడు వరుణ్‌ తేజ్‌పై ప్రశంసలు కురిపించారు. ‘ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూ గర్వించేలా చేస్తుంటావ్‌. ఈ సారి ఇండియా అంతా గర్వపడే సినిమా చేశావ్‌’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఈ ట్రైలర్‌లోని సీన్లు, విజువల్స్‌, యాక్షన్‌ సీన్స్‌ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. ఎయిర్‌ఫోర్స్‌ అధికారిగా వరుణ్‌ తేజ్‌ చేసిన సాహసాలు ఈట్రైలర్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ శిబిరంపై జరిగిన దాడిన, తర్వాత భారత వైమానిక సైన్యం తిరుగుబాటు వంటి సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

ఈ చిత్రంలో వరుణ్‌ ఐఏఎఫ్‌ అధికారిగా నటిస్తుండగా, రాడార్‌ ఆఫీసర్‌గా మానుషి చిల్లర్‌ కనిపించనుంది. మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న రుహానీశర్మ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌, రినైసన్స్‌ పతాకాలపై సందీప్‌ ముద్దా ఈ చిత్రాన్ని నిర్మించారు.