సూక్తులు, నీతి ప్రవచనాలు చెప్పడంలో నూతన్ నాయుడు ఎంత ఘనుడో బిగ్ బాస్ హౌస్‌లో మనమంతా చూశాం. మానవ జాతిలో తానొక్కడే ఉత్తముడైనట్టు చెప్పే సూక్తులు, కొటేషన్స్ విని అందరూ అది నిజమని భావించారు. పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని చెప్పుకునే నూతన్ నాయుడు చుట్టూ ప్రస్తుతం ఉచ్చు బిగుస్తోంది. నూతన్ నాయుడు చేసిన మోసాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఇంట్లో మొబైల్ పోవడంతో పనివాడికి శిరో ముండనం చేయించింది నూతన్ నాయుడు భార్య. ఈ కేసులో వీరిందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. నూతన్ నాయుడు చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన లేదని ఇక్కడే అందరూ అర్థం చేసుకున్నారు. కానీ మనోడి దగ్గర మరిన్ని కళలున్నాయని తాజాగా బట్టబయలు అయింది. వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు అంటూ ఫోన్‌లోనే డీలింగ్ చేసి ఎంతో మందిని మోసం చేశాడట నూతన్ నాయుడు.
మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ పేరిట సుమారు 30 మందికి పైగా అధికారులకు ఫోన్లు చేసి పైరవీలకు పాల్పడ్డాడు. ఈ మోసాలు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్‌కి చేసిన ఫోన్‌తో బట్టబయలైన విషయం తెలిసిందే. ఒకవైపు శ్రీకాంత్‌కు శిరోముండనం సంఘటనలో నూతన్ నాయుడు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా స్పష్టం చేశారు. మరోవైపు మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ పేరిట పైరవీలకు పాల్పడిన కేసులను పోలీసులు ఒక్కోకటి దర్యాప్తు చేస్తూ బయటపెడుతున్నారు.
గతంలో గాజువాక పోలీస్‌స్టేషన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తి అరెస్ట్ అవ్వగా.. నూతన్ నాయుడు తాను మాజీ ఐఏఎస్ అధికారినని అరెస్టైన వ్యక్తిని వదిలేయమని గాజువాక సీఐకి ఫోన్ చేశాడట. అతడు ట్రాఫిక్ సీఐకి కాల్ ట్రాన్స్‌ఫర్ చేయగా.. అది సీఎంఓ ఆఫీస్ నెంబర్ కాదనేసరికి ఫోన్ కట్‌చేసేశారట. ఈ కేసులో కూడా నూతన్‌నాయుడిపై కేసు నమోదు చేశారని తెలుస్తోంది. అలాగే శ్రీదేవి కేబుల్ టీవీలో షేర్స్ కావాలని.. ఆ సంస్థ ఉద్యోగికి ఫోన్ చేశాడట. మిగతా కాల్స్‌ను కూడా ఒక్కొక్కటి దర్యాప్తు చేస్తున్నారట. మొత్తానికి నూతన్ నాయుడు అసలు రంగు అందరికీ తెలిసిపోయింది.
ప్రస్తుతం నూతన్ నాయుడిని కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి అరెస్ట్ చేసి శుక్రవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచారు. శనివారం విశాఖకు బయలుదేరారు. ఆదివారం ఉదయానికి నూతన్‌నాయుడుని విశాఖకు తీసుకురానున్నారని తెలుస్తోంది.