ప్రస్తుతం ఏపీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నూతన్ నాయుడు. నిజానికి బిగ్ బాస్ లోకి వెళ్లేవరకు నూతన్ నాయుడు అంటే ఎవ్వరికీ తెలియదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక నూతన్ నాయుడు అనే వ్యక్తి గురించి తెలుగు ప్రజలకు తెలిసింది. ఆ తర్వాత కొన్ని షోలు, చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం, చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ కాస్తో కూస్తో పేరు సంపాదించుకున్నాడు నూతన్ నాయుడు.
అయితే ఇప్పటికే దళిత యువకుడికి గుండు కొట్టించిన కేసులో నూతన్ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దానితో పాటుగా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరుతో పలువురికి ఫోన్ చేసినట్టు మరో కేసు నమోదు అయింది. వీటితో పాటు నూతన్ నాయుడు మరో కేసులోనూ ఇరుక్కున్నాడు. ఆ కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది.
వైజాగ్ కు చెందిన నూకరాజు, చేవెళ్లకు చెందిన శ్రీకాంత్ రెడ్డి.. ఇద్దరి దగ్గర 12 కోట్ల రూపాయల చీటింగ్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో దీని మీద కూడా నూతన్ నాయుడుపై కేసు నమోదు అయింది.
అయితే.. నూకరాజు, శ్రీకాంత్ రెడ్డి.. అనే ఇద్దరు యువకులకు జాబ్ ఇప్పిస్తానంటూ నమ్మబలికిన నూతన్ నాయుడు వాళ్ల నుంచి సుమారు 12 కోట్లు లాగాడు. రెండేళ్ల నుంచి అదిగో ఉద్యోగం ఇప్పిస్తా.. ఇదిగో ఉద్యోగం ఇప్పిస్తా.. అంటూ తిరుగుతున్నాడని తెలుస్తోంది. డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇవ్వకపోవడంతో వాళ్లు నూతన్ పై కేసు పెట్టారు. దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.