Jr NTR – Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై సినిమా లవర్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ లాంటి బ్లాక్‌బస్టర్లను అందించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కోసం ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి కావొచ్చి, లొకేషన్ల ఖరారు, నటీనటుల ఎంపిక దశలో ఉంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేవలం 10 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి, 2026 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలు విపరీతంగా సమయం తీసుకుంటాయి. కానీ, మేకర్స్ ఫిక్స్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఎలాంటి జాప్యం లేకుండా షూటింగ్ కొనసాగితేనే టార్గెట్ సాధ్యమవుతుంది. ‘సలార్’ కూడా షూటింగ్ ఆలస్యమైన కారణంగా విడుదల వాయిదా పడింది. అటువంటి పరిస్థితి ఈ సినిమాకు రాకుండా ఉండాలంటే, ప్లాన్ ప్రకారం పని చేయాలి.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, పూర్తిగా ప్రశాంత్ నీల్ మూవీపై ఫోకస్ పెట్టనున్నాడు. కథకు తగ్గట్టుగా ఎన్టీఆర్ మేకోవర్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ సినిమాలో రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర తక్కువ నిడివితోనే ఆసక్తికరంగా ఉండబోతుందనే గాసిప్స్ ఉన్నాయి.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు ఉండటం సహజం. అయితే, 2026 సంక్రాంతికి మూవీని విడుదల చేయడం మేకర్స్‌కు ఓ ఛాలెంజ్‌గా మారింది. షూటింగ్ ఆలస్యమైతే, లాంగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో, ప్లాన్ ప్రకారం సినిమా పూర్తవుతుందా లేదా అనేదానిపై టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.