Robinhood: నితిన్ రాబిన్ హుడ్.. భారీ నష్టాలు తప్పేలా లేవు?

రాబిన్ హుడ్ అనే పేరు వినగానే పెద్దోళ్లను దోచి పేదోళ్లకు పంచే న్యాయధర్మ బద్ధమైన దొంగ గుర్తుకు వస్తాడు. అదే పేరు పెట్టుకుని వచ్చిన నితిన్ తాజా చిత్రం మాత్రం ప్రేక్షకుల గుండెల్ని దోచలేకపోయింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ వెచ్చించింది. 70 కోట్లకు పైగా ఖర్చయిన ఈ ప్రాజెక్ట్ మొదటే రిలీజ్ వాయిదాలు, ప్రీరిలీజ్ హైప్‌తో ఓ మంచి అంచనాల్ని సృష్టించింది. కానీ సినిమా విడుదలయ్యాక వచ్చిన నెగెటివ్ టాక్ తో నిర్మాతలు, బయ్యర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.

నితిన్‌కు ‘భీష్మ’ తర్వాత సరైన హిట్ లేకపోయినా, వెంకీ కుడుముల కాంబోపై ఉన్న నమ్మకంతో మైత్రీ భారీగా పెట్టుబడి పెట్టింది. అయితే సినిమా రిలీజ్‌కు ముందే మ్యాడ్ స్క్వేర్, ఎంపురాన్, వీరధీర శూర వంటి చిత్రాలతో పోటీ నెలకొనడం, ముఖ్యంగా మ్యాడ్ స్క్వేర్ హవా చాలా డామినేట్ చేయడంతో రాబిన్ హుడ్ బిజినెస్ బాగా దెబ్బతింది. మొదటి రోజు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చినా, రెండో రోజు నుంచే కలెక్షన్లు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

వీకెండ్ వసూళ్లు కూడా అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంతో సినిమా టోటల్ రన్‌పై ఆశలు తగ్గిపోయాయి. సోమవారం బుకింగ్స్ చూస్తే, రంజాన్ సెలవు ఉన్నా థియేటర్లకు జనం రావడంలో ఆసక్తి చూపడం లేదు. దీంతో బయ్యర్లు పెట్టిన మొత్తం తిరిగి రావడమే కష్టంగా కనిపిస్తోంది. చూస్తుంటే థియేట్రికల్ గా 30కోట్లకు పైనే నష్టాలను కలిగించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రేక్షకుల్లో మెసేజ్ సినిమా అనే ఫీల్ కలిగించడంతో యూత్, మాస్ ఆడియన్స్ కూడా పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. మొత్తానికి రాబిన్ హుడ్ కథ అంతా రివర్స్ అయిపోయింది. సినిమా న్యాయం చేస్తుందని ఆశించిన వారు కూడా నిరాశతో మిగిలారు. మైత్రీ మూవీ మేకర్స్‌కు ఇది కొంచెం ఊహించని షాక్ అని చెప్పవచ్చు. నితిన్ పరంగా చూస్తే వరుస ఫ్లాపుల జాబితాలో మరో చిత్రం చేరిందని చెప్పాలి. ఈ పరాజయం తర్వాత ఆయన తదుపరి సినిమాపై మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.