NEET Results: నీట్ ఫలితాలకు మళ్ళీ బ్రేక్: విద్యార్థుల్లో ఆందోళన

వైద్య విద్యలో ప్రవేశానికి కీలకమైన నీట్ యూజీ 2025 ఫలితాల ప్రక్రియకు ఊహించని ఆటంకం ఎదురైంది. ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా, మద్రాస్ హైకోర్టు వెలువరించిన స్టే ఆదేశంతో ఈ వేచిచూపు మరింత పెరిగింది. పరీక్ష నిర్వహణలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ 13 మంది విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం, ఫలితాలను తాత్కాలికంగా ఆపాలని సూచించింది.

మే 4న నిర్వహించిన ఈ పరీక్షలో తమిళనాడులోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన ఘటన ఈ వివాదానికి నాంది పలికింది. కరెంట్ లేక వెలుతురు లేని తరగతి గదుల్లో పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు గట్టిగా ఆరోపించారు. పరీక్ష కేంద్రంలో సముచిత ఏర్పాట్లు చేయకపోవడం పరీక్ష సమగ్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని వారు పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ అంశాన్ని గంభీరంగా పరిగణించడంతో ఫలితాలు నిలిపివేయబడ్డాయి.

ఇంతలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కూడా నీట్ ఫలితాల విడుదలపై తాత్కాలిక ఆంక్షలు విధించడం మరింత చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఫలితాల ఆలస్యం ఆందోళన రేకెత్తిస్తోంది. జూన్ 2న మద్రాస్ హైకోర్టులో ఈ కేసుపై తదుపరి విచారణ జరగనుండగా, అంతవరకూ ఫలితాలు విడుదల కాదన్న సందేశం స్పష్టంగా అందింది.

ఎన్‌టీఏ ఈ అంశంపై స్పందించాల్సి ఉంది. ఈ తీర్పుల వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా వివిధ రూపాల్లో అభ్యంతరాలు వెల్లువెత్తే అవకాశముంది. ఒకవైపు సీట్ల తగ్గుదల, మరొకవైపు ఫలితాలపై అస్పష్టత విద్యార్థులను గందరగోలానికి గురి చేస్తోంది. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.