ఉదయనిధి చిన్నపిల్లవాడని… సనాతనంపై కమల్ కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సనాతనధర్మం టాపిక్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇదొక అంద విశ్వాసమని, ఇంతకు మించిన దారుణం మరొకటి ఉండదని, అభివృద్ధికి ఇదొక బలమైన ఆటంకం అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం సడన్ చర్చనీయాంశం కావడానికి ఉదయనిధి కామెంట్లు కారణం అయితే… ఆ కామెంట్లపై తాజాగా స్పందించిన కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సనాతన ధర్మాన్ని కోవిడ్, డెంగ్యూ, మలేరియాతో పోల్చిన తమిళనాడు మంత్రి ఉదయనిధి.. దానిని సమూలంగా నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా కొంతమంది విజ్ఞత మరిచి ఉద్యనిధి తల తేస్తే… అంటూ కామెంట్లు చేశారు. దీంతో చేసే పౌరోహిత్యానికి, చేసే మాటలకి సంబంధం లేదని విమర్శలొచ్చాయి.

మరోపక్క పలువురు బీజేపీ నేతలు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదులు చేశారు. దీంతో… మద్రాస్ హైకోర్టు కూడా స్పందించింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదని, ముఖ్యంగా మతానికి సంబంధించిన విషయాల్లో ఎవరినీ నొప్పించకుండా చూసుకోవాలని సూచించింది. అయితే ఈ విషయాలపై మరోసారి ఉదయనిధి స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. ఉదయనిధి చేసిన కామెంట్స్ పై తాజాగా మక్కల్ నీది మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… ఉదయనిధి కంటే ముందు కూడా చాలామంది ప్రముఖులు, సామాజిక వేత్తలు సనాతన ధర్మం గురించి మాట్లాడారని చెప్పారు.

అయితే ఈ విషయంలో ఉదయనిధి చిన్న పిల్లవాడు కావడంతో అందరూ అతన్ని టార్గెట్ చేశారని అన్నారు. ఇదే సమయంలో సనాతన అనే పదం పెరియార్ ద్వారానే అందరికీ తెలిసిందన్నారు. ఒకప్పుడు వారణాసిలోని ఓ ఆలయంలో నుదుటిపై తిలకం పెట్టుకొని పూజలు చేసిన పెరియార్ అంతటివారే… పూజలను వదిలివేసి ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారని, ఆయనకు ఎంత కోపం వచ్చి ఉంటే మాత్రం ఇలా చేస్తారో ఊహించుకోవాలని అన్నారు.

కాగా… నాస్తికవాది, సంఘ సంస్కర్త, ద్రావిడ ఉద్యమ నిర్మాత, దక్షిణ భారతీయులను రాక్షసులుగా వానరులుగా చిత్రీకరించిందంటూ రామాయణాన్ని, రాముడిని తీవ్రంగా విమర్శించిన వ్యక్తి అయిన ఈరోడ్ వేంకట రామస్వామి (ఈ.వీ. రామస్వామి) ని తమిళనాడు ప్రజలు “పెరియార్” (పెద్దమనిషి) గా పిలుచుకుంటారు!