కరోనా మహమ్మారి సృష్టించిన భీబత్సం అంతా ఇంతాకాదు. ఈ వైరస్ వలన ప్రపంచ మొత్తం వణికిపోయింది. ముఖ్యంగా కరోనా ప్రభావం సినీ రంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అయితే మన టాలీవుడ్ లో చాలా మంది అగ్ర తారలను సైతం కబళించింది.థియేటర్స్ కూడా మూతపడేలా చేసింది. కరోనాతో దాదాపు ఏడు నెలలుగా థియేటర్స్ మూతపడడంతో అనేక మంది కార్మికులు రోడ్డున పడ్డారు. నిర్మాతల పరిస్థితి కూడా దయనీయంగా మారింది.
కరోనా ఉధృతి కొంత తగ్గుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌లో భాగంగా అక్టోబర్ 15 నుండి థియేటర్స్ తెరుచుకునేందుకు అవకాశం ఇచ్చింది. కాని ప్రస్తుత పరిస్థితులలో థియేటర్స్ ఓపెన్ చేయకపోవడమే మంచిదని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రంలోను ఇంకా థియేటర్స్ తెరచుకునేందుకు అనుమతులు ఇవ్వకపోవడంతో నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఓ లెటర్‌ను పంపారు. థియేటర్స్ మూతపడడం వలన 50వేల మంది రోడ్డున పడ్డారు. వెంటనే తెరిచి ఆదుకోవాలి. అపాయింట్‌మెంట్ ఇస్తే నిర్మాతలు, సినీ కార్మికులు పడుతున్న బాధలను వివరిస్తానని, సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం ఆ నలుగురు నిర్మాతలే కాదని నట్టి కుమార్ ఈ లేఖలో పేర్కొన్నారు.
థియేటర్ లీజ్ ఓనర్స్ అందులో పనిచేసే కార్మికులకు 8 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి వారికి జీతాలు వచ్చేలా ఆదేశించాలని నట్టి తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు థియేటర్ల మెయింటైనెన్స్ చార్జీలు రూ.3 నుంచి రూ.7లకు పెంచేలా చూడాలన్నారు. థియేటర్స్ కొన్నాళ్లు నష్టాలలో నడుస్తాయి కాబట్టి మార్చి వరకు జీఎస్టీ లేకుండా చూడాలని కోరారు. తెలంగాణలో థియేటర్స్ కు అనుమతులు ఇస్తే చిన్న సినిమాల నిర్మాతలు వారి వారి సినిమాలను తెరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో కూడా ఇస్తే రెండు చోట్ల ఒకేసారి విడుదల చేయోచ్చు అని నట్టి కుమార్ లేఖలో పేర్కొన్నారు. ఈ లెటర్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌కే కాకుండా కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లకు పంపినట్లుగా ఆయన పేర్కొన్నారు.