వ్యోమగాములను కాపాడే పోటీ.. నాసా బిగ్ ప్రైజ్ మనీ

అంతరిక్షంలో జరిగే అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనే వ్యూహాల కోసం నాసా కొత్త పోటీని ప్రకటించింది. సునీతా విలియమ్స్ వంటి వ్యోమగాములు తాత్కాలిక ప్రయోగాల కోసం వెళ్లి, అనుకున్న సమయానికి తిరిగి రావడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇలాంటివి తరచూ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో, లూనార్ మిషన్ మరియు అర్టెమిస్ మిషన్స్ సందర్భంలోనూ వ్యోమగాముల భద్రతకు వినూత్న పరిష్కారాలు అవసరమని నాసా భావించింది.

ఈ పోటీలో పాల్గొనదలిచినవారు ఆన్‌లైన్ ద్వారా తమ ప్లాన్‌ను సమర్పించవచ్చు. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, వ్యోమగాములను భద్రంగా తిరిగి పంపించేలా సృజనాత్మకమైన ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. గెలుపొందిన వారికి 20 వేల డాలర్ల బహుమతిని నాసా ప్రకటించగా, ఇతర సంస్థల నుంచి కూడా అందే బహుమతులతో మొత్తం 45 వేల డాలర్లు, అంటే సుమారు 38 లక్షల రూపాయలు అందజేయనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చు. జనవరి 23లోగా తమ ఆలోచనలను రిజిస్టర్ చేసుకోవాలని నాసా సూచించింది. గెలుపొందినవారి పేర్లను ఫిబ్రవరి చివర్లో ప్రకటిస్తామని తెలిపింది. ఆన్‌లైన్‌లో వచ్చిన ఎంట్రీలన్నింటిని నిపుణులు శ్రద్ధగా పరిశీలిస్తారు. ఈ పోటీ ద్వారా నాసా భవిష్యత్తు మిషన్లలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో సహకారం పొందాలని ఆశిస్తోంది. అత్యుత్తమ పద్ధతులు మాత్రమే గెలిచే అవకాశమున్నందున, కొత్తగా ఆలోచించగల ప్రతిభావంతులకు ఇది చక్కని అవకాశం అని నాసా పేర్కొంది.