‘కల్కి’ భారీ విజయంపై లోకేశ్‌ అభినందన.. దర్శకుడికి నాని, మంచు మనోజ్‌ల కితాబు!

’కల్కి’ సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్‌ సినిమా హిట్‌ కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ విూడియా వేదికగా మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ’కల్కి’ టీమ్‌ను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. సినిమాకు వస్తోన్న అద్భుతమైన రివ్యూలు వినడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణెలకు అభినందనలు తెలిపారు. గొప్ప సినిమాను తెరకెక్కించారంటూ నాగ్‌ అశ్విన్‌కు ధన్యవాదాలు చెప్పారు. తెలుగు సినిమాను గ్లోబల్‌ స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేశారంటూ నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి చిత్రం. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి తీసిన మాస్‌ ఇండియన్‌ ఫిల్మ్‌.. తెలుగు ల్యాండ్‌ నుంచి చూస్తారా? అయితే ’కల్కి 2898 ఏడీ’ని చూడండి.

నాగ్‌ అశ్విన్‌, ప్రభాస్‌ అన్న, వైజయంతీ మూవీస్‌తో పాటు చిత్రబృందం అందరికీ శుభాకాంక్షలు. ఎంతో గర్వంగా ఉందని నటుడు నాని కితాబునిచ్చారు. నలుమూలల నుంచి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వినిపిస్తోంది. టీమ్‌కు శుభాకాంక్షలు.

నాగ్‌ అశ్విన్‌ విజన్‌కు హ్యాట్సాఫ్‌. నిర్మాత దూరదృష్టి, అంకితభావం ఈ పురాణకథకు ప్రాణం పోశాయి. భారతీయ సినీ రంగంలో ‘కల్కి’ ఓ మైలురాయి అంటూ మంచు మనోజ్‌ అభినందించారు.