కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో విస్తరించిందో అందరికీ తెలిసిందే. సామాన్య జనాలు ఈ కరోనా వల్ల ఎంత బాధపడ్డారో సినీ సెలెబ్రిటీలు సైతం అంతే బాధలు పడ్డారు. వరుసగా సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతూ వస్తున్నారు. ఈ మధ్యే నాగబాబు కరోనా నుంచి కోలుకున్నాడు. ప్లాస్మా కూడా దానం చేసి మంచి మనసును చాటుకున్నాడు. ఈ మేరకు నాగబాబు కొన్ని విషయాలు అందరితో పంచుకున్నాడు.
కరోనాని జయించిన యోధుడిని అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదని నాగబాబు చెప్పుకొచ్చాడు. అంటువ్యాధి నుంచి కోలుకున్న ఓ రోగిని మాత్రమేనని ధైర్యంగా చెప్పాడు. ఆస్తమా ఉన్న కారణంగా ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో కంగారుపడ్డానని వెల్లడించాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరానని తన పరిస్థితి గురించి వివరించాడు.
మొదట్లో కొన్నిసార్లు ఊపిరాడక ఇబ్బందిపడ్డానని దీనావస్థ గురించి నాగబాబు పేర్కొన్నాడు. మూడో రోజుకి వాసన గుర్తించే లక్షణాన్ని కోల్పోయానని తెలిపాడు. వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడిన తర్వాత కొన్నిరోజులకు కరోనా లక్షణాలు తగ్గాయని చెప్పుకొచ్చాడు. దీంతో వైద్యులు నన్ను ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారని, ఇంటికి వచ్చాక మరో వారం రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉన్నాననంటూ నాగబాబు కరోనా అనుభవాలను చెప్పాడు.