ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా కొత్త సవాళ్లు, అవకాశాలను తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన, AIని సమర్థంగా ఉపయోగించుకోవాలని, అయితే మానవ మేధస్సును మర్చిపోవద్దని పిలుపునిచ్చారు.
యువత తక్కువ శ్రమతో, ఎక్కువ ఫలితాలను సాధించే దిశగా ముందుకు సాగుతోందని, కానీ అది పూర్తిగా AIపై ఆధారపడకూడదని అంబానీ హెచ్చరించారు. “AI ఓ గొప్ప సాధనం, కానీ మన ఆలోచనా శక్తిని దాని కంటే మించి అభివృద్ధి చేసుకోవాలి. జీవితంలో నిజమైన విజయం అనుభవాల ద్వారా మాత్రమే సాధ్యం” అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా AI విస్తృతంగా వినియోగంలోకి వస్తోంది. తాజాగా, చైనా ‘డీప్‌సీక్’ పేరుతో కొత్త AI మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేయగా, ఇది అమెరికా ఆధిపత్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని ట్రంప్ వంటి ప్రముఖులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ కూడా ఈ మారుతున్న టెక్నాలజీలో ముందుండాలని అంబానీ అభిప్రాయపడ్డారు.
భారతదేశ భవిష్యత్తు గురించి మాట్లాడిన ఆయన, 21వ శతాబ్దం ముగిసే నాటికి భారత్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. AIతో కలిసి దేశ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని, అయితే మానవ విలువలను మరచిపోకూడదని యువతకు సూచించారు. AI ఎంతగా అభివృద్ధి చెందినా, నిజమైన మేధస్సు మనిషి మస్తిష్కం నుంచే పుట్టాల్సిందని, అలాంటి ఆలోచనా శక్తి, పరిశ్రమ, కష్టపడి పనిచేసే తత్వం భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుస్తుందని ముఖేష్ అంబానీ అన్నారు.