తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు గడ్డు సమస్యలు మళ్లీ చర్చకు వచ్చాయి. ముఖ్యంగా టికెట్ ధరల వ్యవహారం, థియేటర్ల నిర్వహణ, పంపిణీ శాతం వంటి అంశాలపై వినిపిస్తున్న అసంతృప్తి నేపథ్యంలో.. ఈ సమస్యల పరిష్కారానికి దారి చూపించే ప్రయత్నం ప్రారంభమైంది. అందుకే శుక్రవారం ఉదయం విశాఖపట్నంలోని దొండపర్తిలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమవేశమయ్యారు. ఈ సమావేశంలో స్రవంతి రవికిశోర్, సి. కల్యాణ్, సుధాకర్ రెడ్డి, భరత్ భూషణ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సి. కల్యాణ్, “ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ల ధరలు చాలా కీలక అంశం. అలాగే పర్సంటేజీల విధానం, థియేటర్ల నిర్వహణలోని సవాళ్లు పరిశ్రమను గట్టిగా వత్తిళ్లకు గురిచేస్తున్నాయి” అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ కమిటీకి ప్రతి సంఘం నుంచి తొమ్మిది మంది చొప్పున మొత్తం 27 మంది సభ్యులు ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.
ఇప్పటికే ప్రభుత్వానికి ఈ కమిటీపై సమాచారం ఇచ్చినట్లు కల్యాణ్ తెలిపారు. సోమవారం నాటికి కమిటీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. థియేటర్లలో జరుగుతున్న తనిఖీల గురించి మాట్లాడుతూ.. అవి నియమిత తనిఖీలే తప్ప, ఆందోళన కలిగించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరిగే ప్రథా ఉందని, దానిలోనూ పలు కీలక అంశాలపై చర్చలు కొనసాగుతాయని వివరించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మార్పులు అవసరమైన ఈ సమయంలో, ఈ కమిటీ ఏర్పాటుతో సమస్యలు పరిష్కార దిశగా నడుస్తాయని సినీ ప్రముఖులు ఆశిస్తున్నారు. టికెట్ల ధరలు సహజమైన స్థాయిలో ఉండాలని, థియేటర్ల నిర్వహణలో పారదర్శకత రావాలని వారు కోరుతున్నారు. కొత్త కమిటీ మార్గదర్శకాలతో పరిశ్రమలో సమతౌల్యం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.