పరమశివునికి జీవితాన్నే అంకితం చేసిన భక్తుడి కథ ‘కన్నప్ప’.. ఇప్పుడు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరపైకి రాబోతోంది. టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా మూవీకి ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 27న తెలుగు సహా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో జనరల్ జెడ్ అంటే నేటి యువత ‘కన్నప్ప’ లాంటి దేవతా ఇతిహాసాల సినిమాలపై ఆసక్తి చూపుతారా అనే ప్రశ్నకు విష్ణు ఇచ్చిన సమాధానం చర్చనీయాంశమవుతోంది.
“ఇప్పటి ఆడియెన్స్ చాలా తెలివైనవాళ్లు. సినిమా బాగుంటుందనిపిస్తే, వారు ఎలాంటి వయసవాళ్లైనా సినిమా థియేటర్‌కి వచ్చి చూస్తారు” అని విష్ణు స్పష్టం చేశారు. అలాగే తన మాటలకు ఉదాహరణగా ‘చావా’ సినిమాను ఉటంకించారు. “ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ కథ ఆధారంగా వచ్చిన చావా మూవీకి చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో హౌస్‌ఫుల్ షోస్ వచ్చినా ఇది నిరూపిస్తుంది. కథ అద్భుతంగా ఉంటే, ఆధ్యాత్మికమైన ఇతిహాసం అయినా ప్రజలు ఆదరిస్తారు” అని విశ్లేషించారు.
ఈ సినిమాకు విష్ణు నటించడమే కాదు, నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. మహాశివుడిగా అక్షయ్ కుమార్, కిరాటుడిగా మోహన్‌లాల్, పార్వతిగా కాజల్ అగర్వాల్ వంటి స్టార్ క్యాస్టింగ్‌తో ఈ చిత్రం అత్యున్నత స్థాయి విజువల్స్‌తో రూపొందుతోంది. అనేక ప్రధాన పాత్రల్లో బాలీవుడ్, సౌత్ స్టార్‌లను రంగంలోకి దింపిన ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ ప్రమోషన్స్‌ను పూర్తి చేసుకుని, బాలీవుడ్‌లో ప్రచారం మొదలుపెట్టింది. విష్ణు వ్యాఖ్యల ప్రకారం, కథ చెప్పే తీరుతో పాటు, ప్రేక్షకులలో చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఏ జెనరేషన్ అయినా సినిమాను ఆదరిస్తుంది. కన్నప్ప కథ కూడా అదే స్థాయిలో ప్రజలను ఆకట్టుకునే శక్తి కలిగి ఉందని ఆయన ధీమాగా పేర్కొన్నారు.