శిలలో శివుడు కదిలివస్తున్నాడా అన్నట్టుగా ఓ మహాశివం ప్రయాణం దేశవ్యాప్తంగా భక్తుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల శివలింగం ఇప్పుడు తన గమ్యాన్ని చేరుకునే యాత్రను ప్రారంభించింది. తమిళనాడులోని మహాబలిపురం నుంచి బిహార్ తూర్పు చంపారన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న విరాట్ రామాయణ మందిరం వరకు ఈ మహాలింగం ప్రయాణం సాగుతోంది. 96 చక్రాలు కలిగిన భారీ హైడ్రాలిక్ ట్రక్కుపై 210 టన్నుల బరువుతో ఈ అద్భుత శిలను తరలిస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి భక్తుల మనసులను కదిలిస్తున్నాయి.
ఒక్క శిలను ఎంచుకుని దానిని పరమేశ్వరుడిగా మలచడానికి పదేళ్ల పాటు కార్మికులు చెమటోడ్చారు. గ్రానైట్ రాయితో చెక్కిన ఈ శివలింగం 33 అడుగుల పొడవు కలిగి ఉండగా, దాని విలువ సుమారు మూడు కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. వేల గంటల శ్రమ, అపారమైన నైపుణ్యం, భక్తిశ్రద్ధ కలిసి ఈ మహాకృతికి రూపం ఇచ్చాయి. ఈ లింగాన్ని క్రమంగా లిఫ్ట్ చేసి ట్రక్కుపై ఎక్కించేందుకు ప్రత్యేక ఇంజినీరింగ్ బృందం రోజుల తరబడి పర్యవేక్షణ చేసినట్లు సమాచారం.
బిహార్‌లోని కేసరియా చాకియా రహదారిపై కైత్వాలియా బహువారా గ్రామాల మధ్య విస్తరించిన భారీ ప్రాంగణంలో విరాట్ రామాయణ మందిరం రూపుదిద్దుకుంటోంది. దాదాపు 500 కోట్ల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. మూడు అంతస్తులు, 12 గోపురాలు, 22 గర్భగుడులు, వాటిలో ఒక గోపురం ఏకంగా 270 అడుగుల ఎత్తుతో నిర్మించబడుతోంది. మొత్తం ఆలయ పొడవు 2,800 అడుగులు, వెడల్పు 1,400 అడుగులు, ఎత్తు 405 అడుగులు ఉండనున్నట్లు ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఆలయ నిర్మాణాన్ని మహవీర్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆచార్య కిషోర్ కునాల్, రాజస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్. ఝా ఈ మహా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రపంచ ప్రసిద్ధ అంగ్కోర్ వాట్ ఆలయ సముదాయం కంటే కూడా ఎత్తుగా ఈ మందిరం ఉండేలా డిజైన్ చేయడం విశేషం.
శివలింగం ప్రయాణం సాగుతున్న దారిపొడవునా భక్తులు ఘనస్వాగతాలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి ప్రధాన నగరంలో ప్రత్యేక పూజలు, దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రక్ ఆగిన ప్రతిచోట వేదమంత్రాలతో అభిషేకాలు నిర్వహించనున్నారు. భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. ఇక బిహార్ చేరుకున్న తర్వాత వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో శివలింగానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించనున్నారు. భక్తి, శిల్పకళ, ఆధునిక ఇంజినీరింగ్ అన్నింటి సమ్మేళనంగా నిలుస్తున్న ఈ మహాశివయాత్ర దేశవ్యాప్తంగా ఓ ఆధ్యాత్మిక సంచలనంగా మారింది. శివుని ఈ మహాకాయ రూపం.. ఇప్పుడు లక్షలాది భక్తుల ఆశల ప్రయాణంగా మారింది.
