కొరియన్‌ నటుడు లీ కున్‌ అనుమానాస్పద మృతి!

ప్రముఖ దక్షిణ కొరియా నటుడు లీ సున్‌ కున్‌ 48 బుధవారం ఉదయం సియోల్‌ లోని ఓ పార్క్‌ వద్ద పార్క్‌ చేసి ఉన్న కారులో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడాన్ని అక్కడి పొలీసులు గుర్తించారు. అయితే లీ సున్‌ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో అతని ఇంటి వద్ద రాసి పెట్టి ఉంచిన ఓ సూసైడ్‌ నోట్‌ను గర్తించినట్టు తెలిసింది.

92వ ఆస్కార్‌ విజేతగా నిలిచిన పారాసైట్‌ చిత్రంలో పార్క్‌ డాంగ్‌ ఇక్‌ అనే ధనవంతుడి పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న లీ సున్‌ కున్‌ అంతకుముందే థ్రిల్లర్‌ హెల్ప్‌లెస్‌ (2012), రొమాంటిక్‌ కామెడీ జానర్‌లో వచ్చిన ఆల్‌ అబౌట్‌ మై వైఫ్‌ (2012), కైమ్ర్‌ / బ్లాక్‌ కామెడీగా వచ్చిన ఎ హార్డ్‌ డే (2014)లో పోషించిన పాత్రలతో కొరియాలో ఓ ఆగ్ర నటుడిగా ఎదిగారు. 1975 లో జన్మించిన లీ సున్‌ కున్‌ చిన్నచిన్న పాత్రలను కూడా పోషిస్తూ వచ్చి హీరోగా మారి తోటి నటి జియోన్‌ హై జిన్‌ను 2009లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇదిలాఉండగా దక్షిణకొరియాలో డ్రగ్స్‌ కు సంబంధించిన కేసులను అక్కడి ప్రభుత్వం తీవ్ర నేరంగా పరిగణిస్తుంది. ఇక్కడి దేశీయులు బయట దేశాలలో ఉన్నప్పుడు డ్రగ్స్‌ తీసుకున్నా మళ్లీ తమ దేశానికి వచ్చాక దానిపై సమాధానం ఇచ్చుకోవాలనేంతగా కఠినంగా ఇక్కడి చట్టాలు ఉంటాయి. ఒకవేళ డ్రగ్స్‌ తీసుకున్నది నిజమేఅని తేలితే 5 నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది.

ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా హీరో లీ సున్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పలుమార్లు విచారణలకు సైతం హజరై టెస్టులు చేయించుకున్నాడు. అయితే గత అక్టోబర్‌లో సియోల్‌లోని ఓ బార్‌ ఉద్యోగితో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నట్లు మరోమారు ఆరోపణలు రాగా ప్రస్తుతం ఈ కేసు విషయంలో విచారణ ఎదుర్కుంటున్నారు.

దీంతో అదే సమయంలో తను నటిస్తున్న నో వే ఔట్‌ అనే టీవీ సిరీస్‌ నుంచి తప్పించడం ఆయన కాస్త మనోవేదనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో లీ భార్య మూడు రోజుల నుంచి లీ సున్‌ కున్‌ కనబడడం లేదని,ఇంట్లో ఓ లెటర్‌ లభించిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును పరిశోధిస్తున్న సమయంలోనే ఓ పార్కు వద్ద ఆగి ఉన్న కారులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల సమగ్ర విచారణ అనంతరం లీ సున్‌ కున్‌ ని హత్యా
లేక ఆత్మహత్యా అనేది తెలుస్తుంది.