సలార్ రిలీజ్ వాయిదా పడిందా… ఇదే క్లారిటీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ఇక విలన్స్ గా జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు.

కేజీఎఫ్ తరహాలోనే సాగే ఈ మూవీ కథాంశం బొగ్గు గనుల నేపథ్యంలో ఉండనుంది. ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తరహాలోనే ఈ మూవీతో కూడా మరోసారి వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించాలని నిర్మాత విజయ్ కిరంగదూర్ లెక్కలు వేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కి ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ ఉంది.

వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రం కావడంతో సలార్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సుమారుగా 600 నుంచి 700 కోట్ల వ్యాపారం ఈ చిత్రంపై జరిగే అవకాశం ఉందనే మాట ట్రెండ్ పండితుల నుంచి వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పుడు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఈ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఈ ప్రచారంపై నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చేశారు.

రిలీజ్ వాయిదా పడుతుందనేది తప్పుడు ప్రచారం అని కొట్టిపాడేసారు. ఇదిలా ఉంటే కేజీఎఫ్ సిరీస్ కి మించి పవర్ ఫుల్ గా యాక్షన్ సీక్వెన్స్ తో పాటు బలమైన సెంటిమెంట్ ఉండేలా సలార్ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారని తెలుస్తోంది.