పవర్ స్టార్ కొడుకు సినిమాలో ఎంట్రీ ఇచ్చాడా .. ఈ సీక్రెట్ ఎందుకు బయటకి రావడం లేదు ..?

టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరో శ‌శికిర‌ణ్ తిక్క తెరకెక్కిస్తోన్న సినిమా మేజర్. శోబిత ధూళిపాల్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ‘క్ష‌ణం’, ‘గూఢ‌చారి’, ‘ఎవరు’ వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న అడివి శేష్ తాజా చిత్రం మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇక సినిమాని ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు నిర్మాత అయినప్పటికి పూర్తిగా ఈ సినిమా బాధ్యతలన్ని అడవి శేష్ మీదే పెట్టాడు. అందుకు కారణం అడవి శేష్ టాలెంట్ ఏంటో ఇప్పటికే ప్రూవ్ అయింది గనక. కాగా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘మేజర్’ నుంచి డిసెంబర్ 17న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెగా వారసుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా నందన్ నటిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా చిన్నప్పటి హీరో పాత్రలో కనిపిస్తున్నాడని అంటున్నారు. ఇదే గనక నిజమైతే మెగా వారసుడి ఎంట్రీ అదిరిపోయినట్టే. మహేష్ బాబు బ్యానర్.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ లో టైటిల్ రోల్ తో ఇండస్ట్రీ ఎంట్రీ.. ఇంతకంటే అద్భుతమైన సినిమా మెగా వారసుడి ఎంట్రీకి దొరకకపోవచ్చు అన టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమా .. నిజమైతే ఎందుకు సీక్రెట్ గా ఉంచారన్నది తెలియాల్సి ఉంది.