ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా రిషభ్ పంత్ జట్టును వీడిన తర్వాత, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి అనేక పేర్లు పరిశీలించారు. అయితే, ఫ్రాంచైజీ చివరకు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. దీంతో ఢిల్లీ జట్టుకు కొత్త నాయకత్వం ప్రారంభమైంది.
ఐపీఎల్ 2024 వేలంలో కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ ఫ్రాంచైజీ రూ.14 కోట్లకు దక్కించుకున్నా, అతను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. తాను పూర్తిగా బ్యాటింగ్‌పై ఫోకస్ చేయాలనుకుంటున్నట్లు యాజమాన్యానికి తెలిపాడు. దీంతో గతంలో తాత్కాలికంగా జట్టును నడిపించిన అనుభవం ఉన్న అక్షర్ పటేల్‌నే కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
గత సీజన్‌లో అక్షర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 364 పరుగులు చేయడంతో పాటు, 13 వికెట్లు తీసి బ్యాటింగ్, బౌలింగ్‌లో తన ప్రాభవాన్ని చాటాడు. జట్టులో కీలకమైన ఆటగాడిగా నిలిచిన అతనిపై మేనేజ్‌మెంట్ పూర్తిగా నమ్మకంతో ఉంది. మిగతా ఆటగాళ్లతో మంచి రాపోర్ట్ ఉండటం కూడా అతని ఎంపికకు సహాయపడింది.
ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న విశాఖపట్నంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. కొత్త కెప్టెన్‌గా అక్షర్ జట్టును ఎలా నడిపిస్తాడు? అతని నాయకత్వంలో ఢిల్లీ కొత్త శకాన్ని ప్రారంభిస్తుందా అన్నది చూడాలి. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ జట్టు కూడా ఐపీఎల్ టోర్నీ లో ఒక్కసారి కూడా ఫైనల్ గెలవలేదు. మరి ఈసారి ఆ జట్టు అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.