ఒకవైపు 20 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలి టీమిండియా అభిమానులను టెన్షన్ లో పడేసింది.. దీంతో తెలుగు తేజం తిలక్ వర్మ భారత్ కు ఆశాకిరణంగా మారాడు. పాక్ బౌలర్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న తిలక్.. ముందు శాంసన్ తర్వాత శివమ్ దూబేతో కలసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో భారత్ తొమ్మిదో ఆసియా కప్ ట్రోఫీని సాధించింది.
పాక్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ ఆరంభం నుంచే ఇబ్బంది పడింది. దీంతో అభిమానులంతా ఇక మ్యాచ్ చేతులారా జారిపోతుందా.. అని ఆందోళన చెందుతుండగా, తిలక్ వర్మ మాత్రం ఒకవైపు క్రీజ్‌లో పట్టు సాధించి ఆటను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. 68 పరుగులతో ఆడిన ఆయన, 4 ఫోర్లు, 3 సిక్సులతో పాక్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. మరోవైపు శివమ్ దూబే 33 పరుగులతో మద్దతునివ్వడంతో చివరి ఎనిమిది ఓవర్లలో వికెట్ పడకుండా భారత్ విజయం వైపు దూసుకెళ్లింది. చివర్లో రింకూ సింగ్ బౌండరీ బాదడంతో ఉత్కంఠభరిత పోరుకు ముగింపు పలికింది.
అంతకంటే ముందు పాక్ బ్యాటర్లు భారత బౌలర్ల ముందు ధాటిగా ఆడారు. ఓపెనర్లు ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) దాటిగా ఆడిగా.. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌లోనే ఔటయ్యారు. కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్లు పడగొట్టగా, వరుణ్ ఛక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. 20 ఓవర్లలో పాక్ 146 పరుగులకే ఆలౌటైపోయింది.
ఈ విజయంతో భారత్ మరోసారి పాక్ పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా తిలక్ వర్మ ఇన్నింగ్స్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. క్రికెట్ విశ్లేషకులు కూడా “భవిష్యత్‌లో టీమిండియాకు కొత్త మిస్టర్ రిలయబుల్”గా తిలక్ పేరు నిలుస్తాడని అంచనా వేస్తున్నారు.
