పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత నటించిన అర్జున్ రెడ్డి గీతగోవిందం అంటే సినిమాలో కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటనకు రౌడీ హీరో అంటూ బిరుదు కూడా ఇచ్చారు. ఆ తర్వాత విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్, టాక్సీవాలా వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ఇక ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా లో నటించిన విజయ్ కి పరాజయం ఎదురయ్యింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా లవ్+ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ నత్తి వాడిలా నటించాడు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత అందరి అంచనాలు తారుమారయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ సినిమా వల్ల నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోయారు. తాజాగా ఈ సినిమా ప్లాప్ గురించి విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఈ సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడుతూ..జీవితంలో జయాపజయాలు చాలా సహజం. అయితే ఇలాంటి పెద్ద సినిమాలో నటించడమే నాకు గొప్ప అవకాశమని, అందులో పోషించిన నత్తి పాత్రను ఆస్వాదించానని అన్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం దేశమంతా తిరిగి ప్రచారం చేయటం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమా కోసం మానసికంగా శారీరకంగా నేను చేయగలిగింది చేశాను…కానీ ఫలితం మాత్రం దక్కలేదు. తప్పు చేయటం అంటే మనకు తెలియని విషయాన్ని నేర్చుకోవడం. ఒకవేళ ఎవరైనా తప్పు చేయట్లేదు అంటే వారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదని అర్థం. జీవితంలో సక్సెస్ వచ్చిన రాకపోయినా ప్రయత్నం చేయడం మాత్రం ఆపకూడదు. జీవితంలో పరాజయం పొందినా కూడా ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటానని విజయ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.