తెలుగు తమిళ ఇండస్ట్రీలలో రాఘవ లారెన్స్ గురించి తెలియని వారంటూ ఉండరు. డాన్స్ కొరియోగ్రాఫర్ గా దర్శకనిర్మాతగా మల్టీ టాలెంట్ ఉన్న రాఘవ లారెన్స్ ఇటీవల ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఎన్నో సినిమాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన రాఘవ లారెన్స్ స్టైల్ సినిమా ద్వారా నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. నాగార్జున హీరోగా నటించిన మాస్, డాన్ సినిమాలలో కూడా లారెన్స్ ప్రధాన పాత్రలలో నటించాడు. ఆ తర్వాత లారెన్స్ నటించి, నిర్మించిన ‘కాంచన’ , ‘గంగ’ , ‘శివలింగా’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యి హారర్ కామెడీ జోనర్లో అత్యధిక వసూళ్లను రాబట్టాయి. ఈ సినిమాలు టీవీలో ప్రసారమైనా ఇప్పటికీ మంచి రేటింగును రాబడుతున్నాయి.
అయితే కొంతకాలంగా లారెన్స్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇలా సినిమాలలో చాలా గ్యాప్ తర్వాత లారెన్స్ వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు.యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో కథిరేశన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన “రుద్రన్” సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాని తెలుగులో రుద్రుడు పేరుతో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక లారెన్స్ చంద్రముఖి 2 లో కూడా నటిస్తున్నాడు. ఇలా మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు పొందిన లారెన్స్ లో మంచి సేవాభావం కూడా ఉంది.
అనాధలు, వికలాంగుల కోసం లారెన్స్ ఒక ఆశ్రమాన్ని నడుపుతూ ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. ఆయన సేవలను గుర్తించిన అంతర్జాతీయ నేర నిరోధక సంస్థ, మానవ హక్కుల సంఘం కలిసి ఇటీవల లారెన్స్ కి గౌరవ డాక్టరేట్ ప్రకటించాయి. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. అయితే ఆ సమయంలో లారెన్స్ రుద్రన్ సినిమా షూటింగ్‌లో ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అందువల్ల లారెన్స్ బదులుగా ఆయన తల్లి హాజరై గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దీంతో లారెన్స్ అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు లారెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.