హిమాచల్ లో చంద్రబాబు… అటునుంచి నరుక్కొస్తున్నారా?

టీడీపీ అధినేత చంద్రబాబు.. అనూహ్యంగా హిమాచ‌ల్ ప్రదేశ్‌ లో ప్రత్యక్షమ‌య్యారు. నిన్న మొన్నటి వ‌ర‌కు ఏపీలో కనిపించిన ఆయ‌న అక‌స్మాత్తుగా హిమాచ‌ల్ ప్రదేశ్‌ లో క‌నిపించ‌డం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఆ రాష్ట్ర గవర్నర్ తెలంగాణలోని బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత కావడం గమనార్హం.

అవును… చంద్రబాబు నాయుడు ఆయన సతీమణితో కలిపి హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. అయితే వ్యాహ్యాళి కోసం.. వెళ్లార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌.. స‌తీస‌మేతంగా చంద్రబాబు హిమాచ‌ల్ ప్రదేశ్ కు వెళ్లార‌ని అంటున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే… ఈ సమయంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను హర్యానా రాజ్‌ భవన్‌ లో మర్యాదపూర్వకంగా కలిశారు చంద్రబాబు దంపతులు. ఈ సందర్భంగా… బాబు దంపతులకు గవర్నర్, ఆయన సతీమణి బండారు వసంత రాజ్‌ భవన్‌ కు స్వాగతం పలికారు. శాలువా కప్పి, కృష్ణుడి విగ్రహాన్ని గవర్నర్ దంపతులు అందజేశారు. సుమారు అరగంటకు పైగా బాబు-దత్తన్న చర్చించుకున్నారు.

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైనా ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌లపైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ ఈసారి కాస్త కీలకంగా మారడం.. ఇదే సమయంలో ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాలే గ‌డువు ఉండ‌డంతో బాబు – ద‌త్తాత్రేయ‌ల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

అయితే బీజేపీతో పొత్తు కోసం బాబు తహతహ లాడుతున్నారని… బీజేపీ – జనసేన కలిసి పోటీ చేసి, టీడీపీ విడిగా పోటీచేస్తే 2019 ఫలితాలే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని ఆయన బలం నమ్ముతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఆయన రాకను బీజేపీ పెద్దలు అనుమతించడం లేదని చెబుతున్నారు.

దీంతో బీజేపీ సీనియర్ నేత, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన నేత అయిన బండారు దత్తాత్రేయని.. చంద్రబాబు కలిశారని.. బీజేపీతో పొత్తు విషయంలో సిఫార్సు కోసం రిక్వస్ట్ చేసుకున్నారని అంటున్నారు పరిశీలకులు. గెలుపు అనివార్యమైన రాబోయే ఎన్నికలకోసం బాబు ఏమైనా చేస్తారని చెబుతున్నారు!