Eega – Lovely: వెండితెరపైకి రాబోతున్న మరో ఈగ.. రాజమౌళి ఈగతో సంబంధం లేదంటూ హీరో క్లారిటీ

రాజమౌళి తీసిన ఈగ చిత్రం తెలుగు ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది. అలాంటి ఫాంటసీ బేస్డ్ కథకు ఇప్పుడు మలయాళం నుంచి వచ్చిన మరో సినిమా లవ్లీతో పోలికలు తెరపైకి వచ్చాయి. ట్రైలర్ చూసిన ప్రేక్షకుల్లో ఓ మనిషి – ఓ ఈగ మధ్య స్నేహాన్ని చూపించడమే కాకుండా, కొన్ని ఫ్రేములు ఈగను గుర్తు చేశాయి. దీంతో ఇది మలయాళ ‘ఈగ’నా అనే ఊహాగానాలు చర్చకు దారితీసాయి.

అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. హీరో మాథ్యూ థామస్ స్పష్టం చేస్తూ, “ఇది రాజమౌళి గారి సినిమా తరహాలో కాదు. మా కథ పూర్తిగా వేరే అంచనాలతో సాగుతుంది. ఇందులో ఈగ ప్రధాన పాత్ర కాదు. కానీ మనుషులకంటే నిజమైన అనుబంధం ఇచ్చే ప్రాణుల కథ ఇది” అని చెప్పాడు. ఇందులో ఈగ పేరు ‘లవ్లీ’గా ఉండటంతో సినిమాకు అదే టైటిల్ పెట్టినట్టు వివరించాడు.

మే 16న తెలుగు, మలయాళంలో విడుదల కానున్న ఈ సినిమా, ఫీల్‌గుడ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని టీమ్ చెబుతోంది. సోషల్ మీడియాలో ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడం, ఈగతో పోలికల వల్ల ఆసక్తి పెరగడం ‘లవ్లీ’కు అంచనాలు పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.