చైనాలో వెలుగుచూసిన హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న చిన్నారిని పరీక్షించగా, హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్టు తేలింది. చైనాలో ఇటీవల ఈ వైరస్ తీవ్రత పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో భారత్‌లో ఇదే మొదటి కేసు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
హెచ్ఎంపీవీ లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ వైరస్ ఎక్కువగా చిన్నారులు, వృద్ధులపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది తుంపురు ద్వారా సులభంగా వ్యాప్తి చెందుతుందని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే మరింత వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ కేసు వెలుగులోకి రావడంతో బెంగళూరులో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పాఠశాలలు, పబ్లిక్ ప్రదేశాల్లో శానిటేషన్ కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే, బాధితులను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొన్నారు.
వైరస్ మొదటి కేసు వెలుగుచూడటంతో ప్రజల్లో భయం నెలకొంది. చైనాలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, భారత్‌లోనూ వ్యాప్తి చెందుతుందేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్యలు, ప్రజల జాగ్రత్తలతో వైరస్ కట్టడి చేయగలరా? అన్నది వేచి చూడాల్సిన అంశం.