ఆకట్టులేకపోయిన ‘ఫ్యామిలీస్టార్‌’ పాత సినిమాలకు కొత్త అతుకులు!

విజయ్‌ దేవరకొండకి ఒక పెద్ద బ్రేక్‌ వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. అటువంటి సమయంలో ఇప్పుడు ఈ ‘ది ఫామిలీ స్టార్‌’ సినిమా విడుదలైంది. దీనికి పరశురామ్‌ దర్శకుడు, మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటించింది. దిల్‌ రాజు, శిరీష్‌ సోదరులు నిర్మాతలు. గోపి సుందర్‌ సంగీతం అందించారు. ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. గోవర్ధన్‌ (విజయ్‌ దేవరకొండ) ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆఖరివాడు. ఇద్దరు అన్నయ్యలు, వదినలు, వాళ్ళ పిల్లలు, బామ్మ, ఇలా ఒక మధ్యతరగతి కుటుంబంలో చిన్నవాడైన గోవర్ధన్‌ కుటుంబాన్ని తన భుజస్కందాలపై నడిపిస్తూ వుంటారు. ఎప్పుడూ ఎక్కడ అదా చెయ్యాలి, ఎలా డబ్బులు అదా చేయొచ్చు అని చూస్తూ ఉంటాడు. ఒక అన్నయ్య ఎప్పుడూ తాగుతూ మద్యం నడిపే దుకాణదారుడితో గొడవపడుతూ ఉంటాడు. అన్నయ్య పిల్లల స్కూల్‌ ఫీజులు, వాళ్ళ అవసరాలు అన్నీ గోవర్ధన్‌ చూసుకుంటూ సంపాదనలో అన్నీ జాగ్రతగా ఖర్చు పెడుతూ ఉంటాడు. అలాగే తన కుటుంబసభ్యులని ఎవరైనా ఏమైనా అన్నా ఊరుకునే మనస్తత్వం కూడా కాదు గోవర్ధన్‌ ది, ఎదురుతిరిగి తగిన బుద్ధి చెపుతూ వుంటాడు.

అలాంటి సమయంలో ఆ ఇంట్లోకి వస్తుంది ఇందు (మృణాల్‌ ఠాకూర్‌) అనే అమ్మాయి. గోవర్ధన్‌ ఉంటున్న ఇంట్లోనే మేడ విూద ఒక గది ఖాళీగా ఉంటే అద్దెకి దిగుతుంది. గోవర్ధన్‌ మొదట్లో ఆమెని వ్యతికేరించినా, మెల్లగా ఆమె చేస్తున్న పనులు నచ్చి ఆమెతో ప్రేమలో పడతాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటాడు. అదే సమయంలో ఆమె గోవర్ధన్‌ విూద ఒక థీసిస్‌ రాస్తుంది, అది తను చేసే మధ్యతరగతి కుటుంబం గురించిన రీసెర్చ్‌ అని యూనివర్సిటీ లో సబ్మిట్‌ చేస్తుంది. అందులో గోవర్ధన్‌ మధ్యతరగతి కుటుంబం గురించిన వివరాలు అన్నీ ఉంటాయి. గోవర్ధన్‌ ఆ పుస్తకం చదివి తన కుటుంబాన్ని మొత్తం రోడ్డువిూదకు ఇందు తీసుకువచ్చిందని, ఆమెని అసహ్యించుకుంటాడు. మధ్య తరగతి కుటుంబం అంటే పస్తులుండే కుటుంబం కాదని, తలుచు కుంటే మేము కూడా సంపన్నులం కాగలమని చూపిస్తాడు. వెంటనే తనకి ఇంతకు ముందు ఆఫర్‌ ఇస్తామన్న ఒక పెద్ద వ్యాపారవేత్త (జగపతి బాబు) దగ్గరికి వెళ్లి తాను ఇప్పుడు ఆ జాబ్‌ తీసుకుంటానని ప్రాధేయపడితే అతను గోవర్ధన్‌ కి ఆ జాబ్‌ ఇస్తాడు, అలాగే రెండు సంవత్సరాల జీతం అడిగితే అది కూడా ముందే ఇస్తాడు.

తాను మధ్యతరగతి కుటుంబం కాదని, ధనవంతుల కుటుంబం అని ఇందుకు చెప్తాడు, ఆమె విూద ద్వేషం పెంచుకుంటాడు. ఇంతకీ ఈ ఇందు అనే అమ్మాయి ఎవరు? ఆమె నిజంగానే గోవర్ధన్‌ మధ్యతరగతి కుటుంబాన్ని వీధిలోకి లాగడం కోసమే థీసిస్‌ రాసిందా? ఆ వ్యాపారవేత్త గోవర్ధన్‌ అడగగానే వుద్యోగం, జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడు? గోవర్ధన్‌, ఇందు మళ్ళీ కలిసారా? వాళ్ళు పెళ్లిచేసుకున్నారా? తరువాత ఏమైంది, గోవర్ధన్‌ జీవితం ఎటువంటి మలుపులు తిరిగాయన్నదే ’ది ఫామిలీ స్టార్‌’ సినిమా కథ. దర్శకుడు పరశురామ్‌ మంచి రచయిత. అతని ముందు సినిమాలు చూస్తే అవన్నీ అర్థం అవుతాయి. అతను, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌ లో ఇంతకు ముందు వచ్చిన ’గీత గోవిందం’ చాలా పెద్ద హిట్‌ అయిన సినిమా. ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరూ ఒకటై ఈ ’ది ఫ్యామిలీ స్టార్‌’ సినిమాతో రావటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. స్వతహాగా సమాజం, కుటుంబ విలువలు ఇలాంటి వాటి గురించి పరశురామ్‌ ఇంతకు ముందు సినిమాలలో బాగా చెప్పగలిగాడు, ఈ ’ది ఫ్యామిలీ స్టార్‌’ కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథ అని ముందుగా చెప్పడంతో కొంచెం ఆసక్తి పెరిగింది.

మధ్య తరగతి కుటుంబంలోకి ఒక ధనవంతురాలు/ ధనవంతుడు సాధారణ మనిషిలా వచ్చి ఆ కుటుంబలో ఒక సభ్యుడిగా మారిపోయి, ఆ కుటుంబాన్ని వాళ్ళకి తెలియకుండా ఆదుకుంటూ ఉండటం, ఆ తరువాత ఒక చిన్న సంఘటనతో వాళ్ళిద్దరిమధ్య తేడాలు రావటం మళ్ళీ కలుసుకోవటం. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి, ఇక్కడ పరశురామ్‌ కూడా అలాంటి ఒక పాత కథనే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునికంగా చెప్పాలని అనుకున్నాడు. ఇందు అనే అమ్మాయి ఆ ఇంట్లోకి రావటం, ఆమెతో గోవర్ధన్‌ ప్రేమలో పడటం, ఆమె ఈ కుటుంబం గురించి రీసెర్చ్‌ చేసి థీసిస్‌ రాయటం, వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ చిన్న తేడాలు రావటం వరకు బాగానే వుంది. అయితే ఇక్కడే పరశురామ్‌ కొంచెం కథ విూద దృష్టి పెట్టలేదు అనిపిస్తోంది.

ఎందుకంటే రెండో సగం మొదట్లో వచ్చే ఈ అమెరికా సన్నివేశాలన్నీ ప్రేక్షకుడికి చాలా బోర్‌ ఫీలవటమే కాకుండా, అవన్నీ వేరే కథలా అనిపిస్తుంది. రెండో సగం అంతా దానిపైనే ఉండటం అదీ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సినిమాకి ఆయువుపట్టు అయిన పతాక సన్నివేశం కూడా దర్శకుడు అంత బాగా తీయలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్‌ దేవరకొండ మధ్యతరగతి కుటుంబంలో బాధ్యతలు మోసే అబ్బాయిగా చాలా బాగా చేసాడు. ’గీత గోవిందం’ సినిమా తరువాత అటువంటి పాత్రలాగే ఇది కూడా కొంచెం వుంది అనిపిస్తుంది. విజయ్‌ మంచి ప్రతిభ గల నటుడు తనకిచ్చిన పాత్రల్లో ఇమిడిపోతాడు, ఇందులో కూడా అలానే గోవర్ధన్‌ పాత్రలో ఇమిడిపోయాడు. కానీ కథ బలంగా లేనప్పుడు అతనుమాత్రం ఏమి చేస్తాడు. ఇక మృణాల్‌ ఠాకూర్‌ పాత్ర అంత బలంగా లేదు, అదీ కాకుండా విజయ్‌, మృణాల్‌ మధ్య ఆ కెమిస్టీ అంతగా వర్కవుట్‌ కాలేదు అనిపిస్తుంది. రెండో సగంలో వెన్నెల కిశోర్‌ వస్తాడు, అతని కామెడీ చూసి చూసి మరీ బోర్‌ అయిపొయింది. ఏ సినిమాలో చూసిన అదే వినోదం, అవే సన్నివేశాలు అతనివి అనిపిస్తుంది. ’ది ఫామిలీ స్టార్‌’ అనే సినిమా మధ్య తరగతి కుటుంబానికి సంబందించిన కథ అని చెప్పినా, ఆ కుటుంబంలో జరిగే సంఘర్షణలని బలంగా దర్శకుడు పరశురామ్‌ చూపించలేకపోయాడు.