ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న.. రెండో టెస్ట్ లో టీమిండియా అదరగొడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తొలి రోజు ఐదు వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. భారత యువ కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుత శతకంతో టీమిండియాకు అండగా నిలబడ్డాడు. మొదట టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే రెండు షాకులు తగిలినా గిల్ మాత్రం నిలకడగా రాణించడు.
199 బంతుల్లో 11 బౌండరీలు బాది 113 పరుగులు చేసిన గిల్, టెస్టు కెప్టెన్‌గా ఇది రెండో శతకం. మొత్తం టెస్టు కెరీర్‌లో ఇది ఏడవ సెంచరీ కావడం విశేషం. గిల్‌తో పాటు ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ కూడా బ్యాట్‌తో మెరిశాడు. జైశ్వాల్ 87 పరుగులు చేసి మరోసారి సెంచరీకి చేరువయ్యాడు కానీ ఈసారి మైలురాయి చేరలేకపోయాడు. 45వ ఓవర్‌లో స్టోక్స్ వేసిన బంతిని కట్ చేయబోయి వికెట్ కీపర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
మొదటి సెషన్‌లో కాస్త తడబడ్డ భారత్, రెండో సెషన్‌లో జైశ్వాల్, గిల్ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు ముందుకు నడిపించారు. రాహుల్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ఇంగ్లాండ్ బౌలర్ల ముందు నిలవలేకపోయారు. రాహుల్ 2, కరుణ్ 31, పంత్ 25, నితీష్ కేవలం 1 పరుగే చేసి వెనుదిరిగారు.
దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్ (113)కి జడేజా (41) సహకరిస్తూ నిలబడ్డాడు. వోక్స్ రెండు వికెట్లు తీయగా, స్టోక్స్, కార్సే, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. గిల్, జడేజా రెండో రోజు కూడా ధాటిగా ఆడితే.. భారత్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.