ఎస్వీబీసీ అడ్వైజర్ గా మంగ్లీ పారితోషికం ఎంతో తెలుసా?

ప్రముఖ జానపద సింగర్ మంగ్లీ తన అద్భుతమైన గాత్రంతో తెలుగింటి జానపద పాటలకు ప్రాణం పోస్తూ తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఎంతో ప్రజాధరణ కలిగిన సింగర్ మంగ్లీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివరాల్లోకెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా మంగ్లీని రెండు సంవత్సరాల కాలానికి నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో ఉన్నంత వరకు ఆమెకు నెలకు లక్ష రూపాయలు జీతభత్యాలు అందిస్తారు.

సింగర్ మంగ్లీ కీలకమైన పదవి చేపట్టడంతో సినిమా అభిమానులు,ఇండస్ట్రీ పెద్దలు రాజకీయ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సింగర్ మంగ్లీ అసలు పేరు సత్యవతి. ఈమెది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా, గుత్తి మండలానికి చెందిన బసినేపల్లి తండాలో జన్మించింది. ఈమెకు చిన్నప్పటి నుంచి సంగీతం మీద మక్కువ ఉండటంతో సంగీతం నేర్చుకొని పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బతుకమ్మ పాటలతో మంచి క్రేజ్ సంపాదించుకుందని చెప్పొచ్చు.

సింగర్ మంగ్లీ అద్భుతమైన గాత్రంతోపాటు నటనలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ప్రతి పండుగకు సింగర్ మంగ్లీ ప్రైవేట్ ఆల్బమ్ రూపొందించి విడుదల చేస్తుంది. ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ అత్యధిక వ్యూస్ సాధించి ప్రేక్షకు ఆదరణ పొందుతున్నాయి. మంగ్లీ కేవలం ప్రైవేట్ ఆల్బమ్సే కాకుండా చాలా సినిమాల్లో పాడిన పాటలు సూపర్ హిట్ సాంగ్స్ గా నిలిచాయి. మంగ్లీ సింగర్ గా ఎన్నో అవార్డులను అందుకోవడం తోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డుల్లో సింగర్ మంగ్లీ 2020లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ జానపద కళాకారిణిగా రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా ఆమెను నియమించడంతో మంగ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.